రికార్డుల నిర్వహణలో అలసత్వం వద్దు
ఎన్‌పీకుంట: రెవెన్యూకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించకూడదని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులను, మ్యుటేషన్ ఫైళ్లను, రిజిస్టర్లను పరిశీలించారు. మండలంలో చేపట్టిన రీ–సర్వే పురోగతిని సమీక్షించారు. అలాగే స్వామిత్వ, గ్రామ కంఠాల రీసర్వే పనులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితమైన రికార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు.
హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయ సిబ్బంది, హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రిజిస్టార్ కృష్ణకుమారి, సబ్‌రిజిస్టార్లు పాల్గొన్నారు.
చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు
జిల్లాలో చెరువులు, వాగులు ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే గుర్తించి బాధ్యులకు నోటీసులు జారీ చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో నిఘా కమిటీ సమావేశం నిర్వహించారు. చెరువులు, వాగులపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలతో వరదలు, నీటి కొరత ఏర్పడుతున్నట్లు చెప్పారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు సువర్ణ, వీవీ ఎస్ శర్మ, మహేష్, ఆనంద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్


