పెన్నా మొత్తం గోతులే..
రొద్దం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రొద్దం మండలంలోని పెన్నానది పరీవాహక ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోంది. ఉచితం మాటున కూటమి నాయకులు కొందరు ట్రాక్టర్ యజమానులతో కలిసి ఇసుక దందా చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో పెన్నానది మొత్తం గుంతలమయంగా మారుతోంది.
పట్టించుకునేవారే కరువు
పెన్నానది నుంచి రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా అధికంగా జరుగుతోందని నదీతీర వాసులు చెబుతున్నారు. ప్రతి గ్రామ తీరం నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలుతోందని రైతులు వాపోతున్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో కర్ణాటక వాసులు, ట్రాక్టర్ యజమానులు కలిసి రాత్రి సమయంలో జేసీబీల సాయంతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా కర్ణాటక, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, పోలీసులకు అంతా తెలిసినా వారు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతున్న ఎవరూ స్పందించడం లేదని రైతులు చెబుతున్నారు.
పెన్నానదిలో ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతుండటంతో నది మొత్తం గోతులు పడ్డాయి. నదిలో ఫిల్టర్ బోర్లు బయట పడుతుండటంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలిపోతే వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు అడగింటి బోర్లు ఎండిపోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బోర్ల వద్ద ఇసుక తరలించకూడదని అడ్డగిస్తే తమపై ఇసుకాసురులు దౌర్జన్యం చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్న ఇసుకాసురులు
యథేచ్ఛగా పెన్నానదిలో
ఇసుక అక్రమ తవ్వకాలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు
పట్టించుకోని అధికారులు
అక్రమార్కుల దెబ్బకు జిల్లాలోని ప్రకృతి వనరులు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా ఇసుకాసురుల దందాతో నదీపరివాహక ప్రాంతాలు కళావిహీనంగా మారాయి. జేసీబీలు, ట్రక్‌లు, ట్రాక్టర్లతో ద్వారా రాత్రింబవళ్లూ కర్ణాటక రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తూ కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారు.
పెన్నా మొత్తం గోతులే..
పెన్నా మొత్తం గోతులే..


