సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
● సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం
ఓడీచెరువు/నల్లమాడ: అమడగూరు, ఓడీ చెరువు, నల్లమాడ పోలీస్‌స్టేషన్లను ఎస్పీ ఎన్.సతీష్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రిజిస్టర్లు, కేసుల రికార్డులు, అలాగే పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితి, దర్యాప్తు పురోగతిని స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల నిమిత్తం వచ్చే వారితో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని, ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకొని పరిష్కారం చూపాలని ఆదేశించారు. రాత్రివేళల్లో గస్తీలు పెంచి, చోరీల నివారణకు అడ్డుకట్ట వేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. నల్లమాడ పోలీస్‌స్టేషన్ పైకప్పు పెచ్చులూడి ఉండటంతో వర్షం వస్తే కారుతోందా అంటూ సీఐ నరేంద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్ కూడలిలో గతంలో పోలీస్‌స్టేషన్ నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని సీఐతో కలిసి ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ నరేంద్రరెడ్డి, ఓడీ చెరువు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, అమడగూరు ఎస్‌ఐ సుమతి, ట్రైనీ ఎస్‌ఐ చెన్నయ్య పాల్గొన్నారు.
సహకార ఉద్యోగుల
సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి టౌన్: సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ నాయకులతో కలసి ఏడీసీసీ బ్యాంక్ ఎదుట సిబ్బంది ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కోఆపరేటివ్ అధికారి కృష్ణానాయక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. జీఓ నంబర్ 36తోపాటు హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, 2019–24వేతన సవరణ చేపట్టాలని, ఉద్యోగులు పదవీవిరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని 2019 సంవత్సరం తరువాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సొసైటీ లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ జిల్లా గౌరవాధ్యక్షుడు నరసింహులు, అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, హరికృష్ణ, కన్వీనర్ ప్రతాపరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, యూనియన్ నాయకులు హనుమంత్‌రెడ్డి, దామోదర్, అన్వర్, రామాంజనేయులు, భారతి, నాగవేణి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి


