టీచర్ల నిరసన ర్యాలీ
మడకశిర: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మడకశిరలో టీచర్లు బుధవారం ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక అమరాపురం బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం కార్యాలయం ఎదుట కాసేపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. 2010 సంవత్సరానికి ముందు నియామకమైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జూన్‌లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయాలని కోరారు. టెన్త్ వంద రోజుల ప్రణాళికలో పబ్లిక్ సెలవులు, పండుగ దినాలను మినహాయించాలన్నారు. డిమాండ్లు నెరవేరకపోతే ఈ నెల 18న డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కళ్యాణచక్రవర్తికి అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, జిల్లా కార్యదర్శి నరసింహప్ప, స్థానిక యూటీఎఫ్ నాయకులు మహలింగప్ప, జోగప్ప, మూడ్లగిరియప్ప తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ రూరల్: టెట్ నుంచి ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం పెనుకొండలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, నాయకులు నరేష్‌కుమార్, నారాయణ స్వామి, రమేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


