నకిలీ బంగారంతో రుణం.. ముద్దాయిల అరెస్టు
ఓడీచెరువు: నకిలీ బంగారంతో బ్యాంక్‌లో రుణం పొంది ఉడాయించాలని చూసిన ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఓడీచెరువు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఈ నెల 9న ఓడీచెరువు ఎస్‌బీఐలో బంగారు ఆభరణాల్లో లక్క ఉంచి తూకం ఎక్కువ చూపించి బ్యాంకులో తాకట్టుపెట్టి ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకొని మోసం చేసిన కేసులో బ్యాంక్ మేనేజర్ ఏసుదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓడీచెరువు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ఇందులో భాగంగా ఓడీ చెరువు మండలం డబురువారిపల్లికి చెందిన అందే జయప్ప, కర్ణాటక రాష్ట్రం యలహంకకు చెందిన ముస్తాక్ పాషా, రఘుకుమార్, బెంగళూరు వాసి సి.నగేష్‌లను శుక్రవారం ఓడీచెరువు మండలం ఎంబీ క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి టయోటా ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముద్దాయిలు చెప్పిన మేరకు ఓడీచెరువు ఎస్‌బీఐలో ఉన్న నకిలీ బంగారు ఆభరణాలను పెద్దమనుషుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తులో ఎస్‌ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, రమేష్‌నాయక్, కానిస్టేబుళ్లు లోకేష్, గోవర్ధన్ సహకరించినట్లు ఎస్‌డీపీఓ విజయ్‌కుమార్ తెలపారు.


