జరిమానాలు సరే.. వసూళ్లేవీ?
● ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో విద్యుత్ విజిలెన్స్ అధికారుల బృందం ఐదు నెలల క్రితం తనిఖీ నిర్వహించింది. విద్యుత్ మీటర్ కనెక్షన్ తీసుకోకుండా అక్రమంగా విద్యుత్ వినియోగించడంతో పాటు మీటర్ ఉండి మీటర్ నుంచి డైరెక్టుగా విద్యుత్ వాడుతున్నట్లు గుర్తించి 24 మందిపై కేసులు నమోదు చేసి రూ.3.50 లక్షల జరిమానా విధించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిమానాలు వసూలు చేయలేదు.
● అనంతపురం నగరంలోని చంద్రబాబునగర్‌లో మహబుబ్‌బాషా అనే వ్యక్తి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. మీటర్ నుంచి కాకుండా డైరెక్ట్‌గా విద్యుత్‌ను వాడుకుంటూ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తుండడంతో రెండేళ్ల క్రితం విద్యుత్‌శాఖ విజిలెన్సు అధికారులు గుర్తించి రూ.2 లక్షలు జరిమానా విధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతను ఒక్క పైసా కూడా జరిమానా చెల్లించలేదు. దీంతో ప్రతి నెలా సర్‌చార్జీల కింద రూ.4 వేలు చొప్పున ఇప్పటి వరకూ దాదాపు రూ.3 లక్షలకు పైగా ఉంది. జరిమానా వసూలులో మాత్రం ఎలాంటి పురోగతి లేదు.
● తాడిపత్రి పట్టణ, రూరల్ మండలాల్లో విద్యుత్ కనెక్షన్లు తీసుకోకుండా కేటగిరి 1 సర్వీసులకు డైరెక్టుగా విద్యుత్ వాడుతున్నట్లు గుర్తించి 18 మందిపై కేసులు నమోదు చేసి రూ.2.20 లక్షలు అపరాధ రుసుమును విధించారు. అయితే వారి నుంచి అరకొరగా రెండు నెలలకు ఒకసారి రూ.వెయ్యి, రెండు వేలు మాత్రం వసూలు చేస్తున్నారు. మరి కొందరు వారి పేరిట కాకుండా వారి కుటుంబ సభ్యుల పేరుతో కొత్త మీటర్ సర్వీసులు తీసుకొని జరిమానాలో పైసా కూడా చెల్లించలేదు.
అనంతపురం టౌన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్న వారిపై ఆశాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. విజిలెన్స్ బృందం తరచూ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమార్కులపై భారీగా కేసులు నమోదు చూస్తూ జరిమానాలు విధిస్తోంది. రెండేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,716 కేసులు నమోదు చేసి రూ.7.25 కోట్ల మేర జరిమానాలు విధించారు. అయితే జరిమానాల వసూళ్లపై మాత్రం విద్యుత్ యంత్రాంగం దృష్టిసారించలేదు. ఈ రెండేళ్ల కాలంలో కేవలం రూ.2 కోట్ల వసూళ్లు కూడా దాటలేదంటే ఏస్థాయిలో విద్యుత్ అధికారులు పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
నెలవారి విద్యుత్ బిల్లులతో సరి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ కనెక్షన్లు తీసుకున్న కొందరు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తించి విజిలెన్సు అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 వేల మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. జరిమానాలను వినియోగదారుల విద్యుత్ బిల్లుకు జోడించారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేస్తున్న విద్యుత్ అధికారులు జరిమానాలు చెల్లించండి అంటూ మాట వరుసకు సైతం వినియోగదారులను అడగడం లేదు. నెలవారి బిల్లును మాత్రం కట్టించుకొని మమ అనిపిస్తున్నారు. జరిమానా మొత్తం రూ.5 వేలు లోపు ఉంటే లైన్‌మెన్, రూ.5 వేలు దాటితే లైన్ ఇన్‌స్పెక్టర్లు, రూ.10 వేలు ఆపైన జరిమానా ఉంటే ఏఈలు, రూ.20 వేలు పైన ఉంటే ఏడీ, డీఈ స్థాయి అధికారులు జరిమానాలు వసూలు చేయాల్సి ఉంది. అయితే విద్యుత్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో జరిమానాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేవలం వినియోగదారులతో నెలవారి బిల్లు మాత్రం వసూలు చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జరిమానాల వసూళ్లపై దృష్టి సారించాల్సి ఉంది.
విద్యుత్ అక్రమ వినియోగదారులపై 11,716 కేసులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
రూ.7.25 కోట్ల జరిమానా
రూ.2 కోట్లు కూడా దాటని వసూళ్లు
తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులు
వసూళ్లపై దృష్టి సారిస్తాం
జరిమానాల వసూళ్లపై విద్యుత్ అధికారులు దృష్టి సారించాలి. ప్రతి నెల దీనిపై సమావేశాలు నిర్వహించి పురోగతిపై దృష్టి సారిస్తాం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విద్యుత్ అధికారులు బృందంగా ఏర్పడి జరిమానా విధించిన వినియోగదారులతో వసూలు చేసే విధంగా దృష్టి సారించాలి. – శేషాద్రి శేఖర్,
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, అనంతపురం
జరిమానాలు సరే.. వసూళ్లేవీ?


