దమ్ముంటే రాజీనామా చెయ్
కదిరి టౌన్: ‘సూపర్‌సిక్స్ పథకాల వల్ల మళ్లీ మేమే గెలుస్తామంటూ నిన్న ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గొప్పలు చెప్పుకున్నారు. మీరు ఈవీఎంలతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మీకు అంత సీన్ లేదు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం’ అంటూ వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ సవాల్ విసిరారు. ఆయన బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సూపర్‌సిక్స్ పథకాలతో మళ్లీ గెలుస్తామన్న భ్రమల్లో కందికుంట ఉన్నారన్నారు. ‘ఇప్పుడు మీరు పాలకపక్షంలో ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా సరే ఎన్నికలకు సిద్ధం. ఇప్పుడు ఎన్నిక జరిగినా వైఎస్సార్‌సీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. గతంలో జగనన్న సాగించిన సంక్షేమాభివృద్ధి పాలన కారణంగా ప్రజలు మమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు’ అని అన్నారు. ప్రెస్‌మీట్‌లో కందికుంట హుందాతనం, సంస్కారం లేని భాష మాట్లాడారన్నారు. కదిరి ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, సమయం వచ్చినప్పుడు గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. గొప్పలు చెప్పుకోవడం మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ ప్రణీత్‌రెడ్డి, మునిసిపల్ విభాగం కార్యదర్శి కృపాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, కౌన్సిలర్ రామ్‌ప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎవరేంటో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం
మీకు మళ్లీ గెలిచే సీన్ లేదు
కందికుంటకు వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త మక్బూల్ సవాల్


