పది విద్యార్థికి విషమ పరీక్ష!
కదిరి: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లాలో అమల్లోకి వచ్చింది. 100 శాతం ఫలితాలు సాధించడం కోసం దీన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రోజంతా తరగతులు, మళ్లీ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు, సెలవు రోజుల్లో కూడా తరగతుల నిర్వహణ కారణంగా పిల్లలకు విశ్రాంతి కరువవుతోంది. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 దాకా బడిలోనే గడపాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇక స్థానికంగా హైస్కూల్‌లో లేక సమీపంలోని గ్రామంలో ఉన్న పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తల్లిదండ్రులు, టీచర్లు చెబుతున్నారు.
సంక్రాంతి సెలవుల్లోనూ బడికి వెళ్లాల్సిందే..
జిల్లాలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 15,384 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరంతా ఈ నెల 6వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకూ సెలవు రోజుల్లో కూడా బడికి వెళ్లాల్సిందే. రోజూ ఉదయం, సాయంత్రం మరో రెండు గంటలు అదనంగా బడిలో కూర్చోవాలి. పిల్లలతో పాటు 10వ తరగతికి బోధించే ఆయా సబ్జెక్టు టీచర్లు కూడా సంక్రాంతి సెలవుల్లో బడికి వెళ్లాల్సిందే. సెలవురోజుల్లో పనిచేసే వారికి సీసీఎల్ కూడా ఇవ్వకుండా కనీస పనిదినాల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీనికి తోడు ప్రస్తుతం వాట్సాప్ ద్వారా పంపే ప్రశ్నపత్రాలను జిరాక్స్ చేసుకుని పరీక్ష నిర్వహించడం, వాటిని దిద్ది అదే రోజు ‘లీప్ యాప్’ లో నమోదు చేయాల్సి రావడంతో టీచర్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సెలవుదినాల్లోనూ పని చేయాల్సి రావడంపై పెదవి విరుస్తున్నారు.
ఉత్తమ ఫలితాల కోసం
ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
సెలవు రోజుల్లోనూ పనిచేయాలంటూ
టీచర్లకు ఆదేశాలు
ఈ నెల 6 నుంచి విద్యార్థులకు
రోజూ అదనపు తరగతులు
విశ్రాంతి కరువై విద్యార్థుల్లో పెరిగిన ఒత్తిడి
మానసిక సమస్యలతో చాలా మంది సతమతం
సెలవుల్లో తరగతుల నిర్వహణపై
టీచర్ల నుంచి వ్యతిరేకత
ఎన్‌పీకుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. వీరిలో 20 మంది పెడబల్లి నుంచి రోజూ 8 కి.మీ నడిచి స్కూల్‌కు వచ్చి.. మళ్లీ సాయంత్రం ఇళ్లకు వెళ్తారు. ప్రస్తుతం సాయంత్రం 5.15 గంటలకే సూర్యాస్తమయం అవుతుండగా.. పిల్లలు ఇంటికి చేరే సరికే చీకటి పడుతోంది. ఆటోలు కూడా లేనందున పిల్లలు బిక్కుబిక్కుమంటూ భయంతో ఇల్లు చేరుతున్నారు. ప్రభుత్వం తాజాగా రోజూ రెండు గంటలు అదనంగా స్కూళ్లలో తరగతులు ఏర్పాటు చేస్తుండటంతో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలలోనే చీకటి పడితే ఎలా ఇళ్లకు చేరుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇలాంటి విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా చాలా మందే ఉన్నారు.


