ఉద్యాన రైతుకు ఊతంగా నిలవండి
● అధికారులకు కలెక్టర్
శ్యాం ప్రసాద్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ఉద్యాన రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి వారికి ఊతంగా నిలవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం అమలులో భాగంగా జిల్లాలో అమలు చేయాల్సిన దీర్ఘకాలిక లక్ష్యాలు, లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు, కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, డీఆర్‌డీఏ, డ్వామా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా భౌగోళిక పరిస్థితులు, పంట పద్ధతులు, నీటి వనరులు, నేల స్వభావం వంటి క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పశుసంవర్ధకశాఖ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్‌డీఏ, డ్వామా పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల్లో లోటుపాట్లు లేకుండా పురోగతి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శుభదాస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు రామగిరి
ఎంపీపీ ఉప ఎన్నిక
రామగిరి: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఉదయం ఎంపీపీ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంజీవయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రామగిరి ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగుసార్లు నోటిఫికేషన్ విడుదల చేసినా, ప్రతిసారి అధికార పార్టీ దౌర్జన్యాలతో మెజార్టీ ఎంపీటీసీ సభ్యుల గైర్హాజరు కావటంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మరోసారి ఎన్నిక నిర్వహణ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఇప్పటికే వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నేడు జరిగే ఎంపీపీ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
నకిలీ బంగారంతో
బ్యాంక్ రుణం!
● పోలీసుల అదుపులో కర్ణాటక ముఠా
● కొనసాగుతున్న విచారణ
ఓడీచెరువు: నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం తీసుకునేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకకు చెందిన ఓ ముఠా పక్కా ప్రణాళికతో అధిక బరువుతో వడ్డాణానికి పైపొర మాత్రం బంగారంతో చేసి బ్యాంక్‌ల్లో తాకట్టు పెట్టి రుణం పొందేలా కుట్రకు తెరలేపారు. ఇలాంటి వడ్ఢాణాలు పెద్ద సంఖ్యలో చేసినట్లు సమాచారం. స్థానికేతరులు కావడంతో తమపై అనుమానం రాకుండా ఉండేందుకు రుణంపై కొంత మొత్తం కమీషన్ చెల్లించేలా స్థానిక రైతులతో ఒప్పందం చేసుకుని బ్యాంక్‌లో తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం పొందేలా పథకం రచించారు. ఇందులో భాగంగా గోరంట్ల, ఓడీ చెరువులోని పలువురు రైతులను ఒప్పించారు. బుధవారంఖరీదైన కారులో ఓడీచెరువులోని ఎస్‌బీఐ శాఖకు చేరుకున్న కర్ణాటక వాసులు.. 280 గ్రాముల బరువున్న వడ్డాణాన్ని బ్యాంక్ అధికారులకు స్థానిక రైతు ద్వారా అందజేయించి తాకట్టు రుణం కావాలని అడిగించారు. పెద్ద మొత్తంలో రుణం కావడంతో బ్యాంక్ అధికారులు పలు రకాలుగా ప్రశ్నలు సంధించడంతో రైతు తడబడడంతో అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో అసలు సూత్రధారులు జోక్యం చేసుకుని బ్యాంక్ అధికారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా బ్యాంక్ అధికారులు పదేపదే ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో వెంటనే బ్యాంక్ తలుపులు మూతవేయించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. వీరికి చెందిన ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలోనూ గతంలో మోసగించినట్లు అనుమానాలు వ్యక్తం కాగా, ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు.
ఉద్యాన రైతుకు ఊతంగా నిలవండి


