మామిడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టండి
పుట్టపర్తి: మారిన వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో మామిడి తోటల్లో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు జిల్లా ఉద్యాన అధికారి (డీహెచ్‌ఓ) చంద్రశేఖర్ సూచించారు. మామిడి తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై మంగళవారం బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి కల్యాణమంటపంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సరైన సమయంలో సరైన సస్యరక్షణ చేపడితే మామిడిలో అధిక దిగుబడులు సాధ్యమవుతాయన్నారు. అనంతరం సమీపంలోని మామిడి తోటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. ప్రస్తుతం 10 శాతం కంటే తక్కువ పూత వచ్చిందని, పూత రాని తోటల్లో 10 గ్రాముల 13.0.45 ఎరువు, 3 గ్రాముల సూక్ష్మధాత మిశ్రమాన్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. 10 నుంచి 20 శాతం పూత వచ్చిన తోటల్లో ఒక ఎం.ఎల్.డబుల్ , 2 ఎం.ఎల్. హెక్సా కొనజోల్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. 50 శాతం, అంతకు మించి పూత వచ్చిన తోటల్లో 0.3ఎం.ఎల్. ప్లానోపిక్స్‌ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో బుక్కపట్నం మండల వ్యవసాయాధికారి నటరాజ్, హెచ్‌ఓ నవీన్, రైతులు ఆవుటాల రమణారెడ్డి, రామసుబ్బారెడ్డి, గోపాలరెడ్డి, రంగారెడ్డి, ఓబిరెడ్డి, శంకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


