ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు
బత్తలపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి మధ్య వాటాల్లో తేడా రావడంతో వాగ్వాదానికి దిగి డయల్ 100కు ఫోన్ చేసి దొరికిపోయారు. రూ.లక్ష అసలు నోట్లకు రూ.3 లక్షల దొంగ నోట్లు ఇస్తాననే ఒప్పందంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తితో కదిరి వాసి ఒప్పందం చేసుకున్నాడు. అయితే నోట్లు చూడగానే నకిలీగా కనిపిస్తున్నాయని గొడవ పడ్డారు.
పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మార్పిడి ముసుగులో నకిలీ నోట్ల చెలామణి విచ్చలవిడిగా సాగుతోంది. గమనించని కొందరు పర్సెంటేజీలకు ఆశపడి రూ.లక్షల్లో మోసపోతున్నారు. రెండు నెలల క్రితం గోపురం క్రాస్ వద్ద రూ.60 లక్షలు మోసపోయినట్లు తెలిసింది. అయితే బ్లాక్ వ్యాపారం కావడంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ముదిగుబ్బ మండలానికి చెందిన రైతు నగేశ్ ఈ ఏడాది ఆరంభంలో కదిరి పట్టణంలోని మార్కెట్ యార్డులో రెండు పొట్టేళ్లను అమ్మాడు. కొనుగోలు చేసిన కేటుగాళ్లు రూ.32 వేలు నకిలీ నోట్లు కట్టబెట్టి పరారయ్యారు. కొత్తచెరువు గొర్రెల సంతలో మూడు నెలల క్రితం ఓ వ్యక్తి నకిలీ నోట్ల మార్పిడి చేసి పరారీ అయ్యాడు. మోసపోయిన బాధితుడు ఆ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా.. బ్యాంకు అధికారులు నకిలీ నోట్లుగా గుర్తించారు.
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో దొంగ నోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అమాయకులు, రైతులను లక్ష్యంగా చేసుకొని నకిలీ నోట్ల కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ చోట్ల నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్నారు. గమనించని అమాయకులు నకిలీ నోట్లను తీసుకుని మోసపోతున్నారు. ఆ తర్వాత బ్యాంకులకు వెళ్తే.. అక్కడ అవి నకిలీ నోట్లుగా తేలుతున్నాయి. బ్యాంకు అధికారులు చెబితే కానీ.. గుర్తించలేని పరిస్థితి.
సంతలే లక్ష్యంగా...
కొందరు కేటుగాళ్లు ప్రతి వారం గొర్రెలు, మేకల సంత, పశువుల సంతలను టార్గెట్ చేసి.. జీవాలను కొనుగోలు చేసి నకిలీ నోట్లు కట్టబెట్టి పరారవుతున్నారు. కేవలం దొంగ నోట్ల మార్పిడి కోసం సంతలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొత్తచెరువు, గోరంట్ల, కదిరి, తనకల్లులో నకిలీ నోట్ల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పుట్టపర్తిలో విదేశీ కరెన్సీ మార్పిడిలో నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్నట్లు సమాచారం. హిందూపురం పట్టణంలో వాణిజ్య వ్యాపారాల పేరుతో పెద్ద మొత్తంలో రూ.200 నోట్ల కట్టల్లో నకిలీ నోట్లు చేర్చుతున్నట్లు తెలిసింది.
రూ.లక్షకు రూ.3 లక్షలు
దొంగ నోట్లు రూ.3 లక్షలు కావాలంటే.. రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే సరిపోతుంది. ఈ లెక్కన మూడింట రెండు వంతుల నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంగా బయటి ప్రాంతాల నుంచి కొందరు కేటుగాళ్లు జిల్లాలో ప్రవేశించారు. నకిలీ నోట్ల కట్టలను.. అసలు నోట్లతో కలిపి చెలామణి చేస్తున్నారు. బెంగళూరు, చైన్నె నుంచి ఒక ముఠా నుంచి నకిలీ నోట్ల కట్టలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం. అతడి వద్ద నుంచి 30 శాతం పర్సెంటేజీతో కొందరు తీసుకొచ్చి.. మార్పిడి చేస్తున్నారు. ఈ లెక్కన రూ.200 నోటుకు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది. పర్సెంటేజీలకు ఆశపడి కొందరు యువత నకిలీ నోట్ల చెలామణి పనిలో బిజీగా గడుపుతున్నారు. ఎక్కడైతే ఎక్కువగా నగదు సహిత లావాదేవీలు ఉంటున్నాయో.. అక్కడ ఎంట్రీ ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారు.
పెద్ద నోట్లు కాదని..
పెద్ద నోట్లతో మోసం జరుగుతోందని ప్రచారం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రూ.500 నోట్లు ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. దీంతో నకిలీ నోట్ల మార్పిడి కొంచెం కష్టంగా మారడంతో చాలామంది రూ.200 నోట్లపై పడినట్లు తెలిసింది. హిందూపురం పట్టణంలో చిన్న చిన్న వ్యాపారాల విషయంలో రూ.200 నోట్ల కట్టలు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయా నోట్ల కట్టల్లో నకిలీ నోట్లు కలపడంతో మోసపోయిన ఘటనలు ఇటీవల కాలంలో నాలుగైదు వెలుగు చూశాయి.
జిల్లాలో జోరుగా నకిలీ నోట్ల దందా
రూ.లక్షకు మూడు లక్షల చెల్లింపు
బత్తలపల్లిలో ఇద్దరి అరెస్టు


