రాప్తాడును రావణ కాష్టంలా మార్చారు | - | Sakshi
Sakshi News home page

రాప్తాడును రావణ కాష్టంలా మార్చారు

Dec 10 2025 7:29 AM | Updated on Dec 10 2025 7:29 AM

రాప్తాడును రావణ కాష్టంలా మార్చారు

రాప్తాడును రావణ కాష్టంలా మార్చారు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో నిత్యం హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరిగి పోయాయి. ఆమె ఒక లేడీ మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండి, అవకాశం లేకపోయినా సొంత మండలం రామగిరిలో ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు సునీత అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. మెజార్టీ ఎంపీటీసీలు తమ వైపు ఉన్నా, కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నా మీకు ఏదీ అనుకూలంగా లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రకటించారు. మీరు కోరిన ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీగా చేసుకోవాలని సూచించారు. అయితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని పరిటాల కుటుంబం గుర్తు పెట్టుకోవాలన్నారు. మజ్జిగ లింగమయ్య హత్యతోనే ప్రారంభమైన పరిటాల కుటుంబ పతనం పాపంపేట దోపిడీతో సంపూర్ణమైందన్నారు.

అలా చేస్తే రాజకీయ సమాధే

పరిటాల సునీత నలుగురు రిటైర్డ్‌ తహసీల్దార్లకు జీతాలిస్తూ తమ వద్ద పెట్టుకున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. వివాదాస్పద భూములను గుర్తించి వాటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ‘నీ మొగుడు నాలుగుసార్లు, నువ్వు మూడుసార్లు ఎమ్మెల్యేలైనా రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాలకు ఏమైనా చేసి ఉంటో చెప్పుకోండి’అని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురాలేని చేతగాని కుటుంబం పరిటాల కుటుంబమన్నారు. ఇలా బతికే బదులు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలని హితవు పలికారు. లేదంటే మీ ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకుని తాము ప్రారంభించి మీ ప్రభుత్వంలో ఆగిన అన్ని పథకాలనూ పూర్తి చేస్తే అప్పుడైనా ప్రజలు ఆదరిస్తారన్నారు. అలాకాకుండా ప్రకాష్‌రెడ్డిని తిట్టినా, ప్రశ్నించిన వారిని, ఎదిరించిన వారిని హత్యలు చేసుకుంటూపోతే రాజకీయ సమాధి కావడం తథ్యమని స్పష్టం చేశారు.

విద్య, వైద్యం వ్యాపారంగా మార్చేశారు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేలా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోందని ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా తమ అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా 11 లక్షల సంతకాలు అయ్యాయని, ఇందులో రాప్తాడు నియోజకవర్గంలో 70 వేలకు పైగా ప్రజలు సంతకాలు చేశారని వివరించారు. ప్రభుత్వ వైద్యం, విద్య రంగాలను ప్రైవేటీవకరణ, కార్పొరేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారంగా మార్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, ఆలమూరు ఓబులేసు, మీనుగ నాగరాజు, ఎంపీటీసీ సునీల్‌దత్తరెడ్డి, కుంటిమద్ది సర్పంచ్‌ నరేంద్ర, తోపుదుర్తి ఎంపీటీసీ పోతులయ్య, ప్రణిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

లేడీ మాఫియా డాన్‌

పరిటాల సునీత

సొంత మండలంలో ఎంపీపీని దక్కించుకోలేకపోతున్నావ్‌

ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగితే మంచిది

అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీపీ ఎన్నికను బాయ్‌కాట్‌ చేస్తున్నాం

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement