జోరుగా కోటి సంతకాల సేకరణ
సాక్షి, పుట్టపర్తి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ జిల్లాలో జోరుగా సాగుతోంది. డిసెంబర్ 9 నాటికి హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3,78,081 మందితో సంతకాలను సేకరించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మేధావులు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొని సంతకాల సేకరణ చేపడుతున్నారు. పార్టీ శ్రేణులు అన్ని ప్రాంతాల్లో సంతకాలు సేకరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.
● మడకశిర పట్టణంలో 11వ వార్డులో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి, కౌన్సిలర్ రెహానా, 14వ వార్డులో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మంగళవారం జరిగింది. అలాగే వైబీ హళ్లి, జమ్మానిపల్లి, కొలిమిపాళ్యం, గౌడనహళ్లిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, రొళ్ల మండలం గొట్టుగుర్కిలో వైఎస్సార్‌సీసీ జిల్లా ఎస్సీ సెల్ ఈసీ మెంబర్ నాగభూషణ, గుడిబండ మండలం కేకాతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
●హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలంలోని గలిబిపల్లి, సోమిరెడ్డిపల్లి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సయ్యద్ నిస్సార్, వైస్ ఎంపీపీ అంజినరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరించారు.


