బ్యాంకు ఖాతాలో నగదు మాయం
సోమందేపల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.80 వేల నగదును దుండగులు అపహరించారు. సోమవారం ఓ నంబర్ నుంచి తనకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి చాటింగ్ చేస్తూ మోసం చేసినట్లు బాధితుడు మంగళవారం విలేకరులకు తెలిపాడు. క్షణాల్లో తన ఖాతాలో ఉన్న నగదు అదృశ్యమైందన్నారు. ఘటనపై స్థానిక పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
తోలుబొమ్మల కళాకారిణి శివమ్మకు ‘శిల్పగురు’ అవార్డు
ధర్మవరం రూరల్: డిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ హస్త కళాకారుల జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ శిల్పగురు జాతీయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ అవార్డుల పోటీలో 2023 సంవత్సరానికి గాను తాము పంపిన శ్రీ విష్ణు చరిత, విశ్వరూప హనుమాన్ తోలుబొమ్మలకు అవార్డు దక్కిందని శివమ్మ తెలిపారు. మంగళవారం డిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నారు.
నాణ్యమైన భోజనం వడ్డించండి
మడకశిరరూరల్: మండల పరిధిలోని గుండుమల కేజీబీవీ పాఠశాలను మంగళవారం జిల్లా సమగ్రశిక్ష అడినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ) దేవరాజు సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ పాఠశాలను సోమవారం రాత్రి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తనిఖీ చేసి భోజన పథకం నాణ్యత, మెనూ అమలు తీరు, విద్య ప్రగతి తదితర వాటిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీసీ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల సమస్య లేకుండా చూస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు.
స్కిల్ హబ్ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ
ప్రశాంతి నిలయం: జిల్లాలోని యువతకు స్కిల్ హబ్ సెంటర్ల ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 8 నైపుణ్య హబ్‌లు, పార్లమెంట్ పరిధిలో ఒక నైపుణ్య కళాశాలను స్థాపించి వివిధ రంగాలలో యువతకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేసి వాటి ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. మరింత సమాచారం కోసం 9390176421, 9398643930, 9966682246 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.
బ్యాంకు ఖాతాలో నగదు మాయం
బ్యాంకు ఖాతాలో నగదు మాయం
బ్యాంకు ఖాతాలో నగదు మాయం


