దొంగనోట్ల ముఠా అరెస్టు
బత్తలపల్లి: దొంగనోట్లు చెలామణి చేసే నలుగురిని అరెస్టు చేసినట్లు ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో దొంగల ముఠా సభ్యులను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఎస్‌ఐ సోమశేఖర్, ట్రైనీ ఎస్‌ఐ నాగప్రసన్నలతో కలిసి సీఐ విలేకర్లతో మాట్లాడారు. కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరుకు చెందిన బోడేపల్లి అంజి, అదే జిల్లా కొండాపురం మండలం దామలూరుకు చెందిన ఓబులేసు, అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయపల్లికు చెందిన శిరోల్లా రాజకుళ్లాయప్ప, వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం లింగయ్యపల్లికి చెందిన ఇల్లూరి వీరాంజనేయరెడ్డి బృందంగా ఏర్పడ్డారన్నారు. ఇందులో భాగంగానే నకిలీ నోట్లు ఉన్న ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన బాలు, హరిలను కలిసి రూ.3 లక్షలు ఒరిజినల్ నోట్లకు రూ.9 లక్షల నకిలీ నోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు. గతనె 19న బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామ సమీపంలోని కాటికోటేశ్వర క్షేత్రంలోకి వెళ్లే ఆర్చ్ వద్ద వీరాంజనేయరెడ్డి దగ్గర ఉన్న అసలైన రూ.3 లక్షలు తీసుకొని బాలు, హరి రూ.9 లక్షల నకిలీ నోట్లు ఇచ్చి వెళ్లిపోయారన్నారు. అయితే వారు ఇచ్చిన నకిలీ నోట్లు కూడా సరైనవి కాదని వీరాంజనేయరెడ్డి గమనించి విషయాన్ని ఓబులేసు, అంజిలకు చెప్పారన్నారు. డబ్బుల విషయంపై సోమవారం బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లి క్రాస్ వద్ద వారి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా అసలు విషయం బయట పడిందని చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు పంపిన్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వారి వద్ద నుంచి రూ.500 నకిలీ నోట్లు 600 మేర స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


