ప్రమాదంలో యువకుడి మృతి
గుత్తి రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన దోణప్ప, భూదేవి దంపతుల కుమారుడు నల్లారెడ్డి (32)కి భార్య సునీత, కుమార్తె రమ్య ఉన్నారు. గ్రామంలో వ్యవసాయ కూలి పనులతో పాటు గుత్తిలో మొబైల్ సిమ్‌లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య రెండో సారి గర్భం దాల్చి ఏడు రోజుల క్రితం అనంతపురంలోని ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. సోమవారం డిశ్చార్జ్ ఉండడంతో సాయంత్రం గుత్తిలో తన ద్విచక్ర వాహనాన్ని ఆపి, అనంతపురానికి వెళ్లి రాత్రికి భార్య, చిన్నారిని తీసుకుని కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో కారు గుత్తికి చేరగానే నల్లారెడ్డి దిగి ద్విచక్ర వాహనం తీసుకువస్తానని భార్యకు తెలిపి వారిని సాగనంపాడు. అనంతరం తన బైక్ తీసుకుని కారును అనుసరిస్తూ లచ్చానుపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న వారు గమనించి, వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనతో భార్య, కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆస్పత్రిలో ప్రసవించిన భార్య, నవజాత శిశువుతో ఇంటికి వెళుతుండగా ఘటన


