కియాలో కమాండోల మాక్‌డ్రిల్
పెనుకొండ రూరల్: ఉగ్రవాదులు దాడి చేస్తే వారిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి, ఆత్మరక్షణ ఎలా పొందాలి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా బాధితులను ఎలా రక్షించాలి అనే అంశాలపై కియా పరిశ్రమలో ఆక్టోపస్ కమాండోలో సోమవారం అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసే విధానంతో పాటు ఉగ్రవాదులు చొరబడిన భవనం, పరిసరాలు లోపలకు, బయటకు వెళ్లే మార్గాలు, భవనంలో ఎంతమంది చిక్కుకుపోయారు. బాంబులను అమర్చారా? సీసీ కెమరాల ద్వారా అనుమానితులను గుర్తించే అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఆపరేషన్ పాల్కాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రణాలిక ప్రకారం తొలుత ఐదుగురు ఉగ్రవాదులు పరిశ్రమలోని అడ్మిన్ విభాగంలోకి చొరబడటం, సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపే విధానం రక్తి కట్టించారు. సమాచారం అందుకున్న ఆక్టోపస్ కమాండోలు వ్యూహాత్మకంగా పరిశ్రమలోకి ప్రవేశించే విధానం బందీలుగా ఉన్న కార్మికులను రక్షించే విధానం చూపరులను గగుర్పాటుకు గురి చేసింది. అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్, రూమ్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. దాదాపు ఒకటిన్నర గంటపాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. కార్యక్రమంలో కియా పరిశ్రమ సీఎస్‌ఓ మధుసూదన్, ఆక్టోపస్ డీఎస్పీ జగ్గునాయుడు, బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్, కియా పీఎస్ ఎస్‌ఐ రాజేష్, సెక్యూరిటీ ఇన్‌చార్జ్,నవీన్, తదితరులు పాల్గొన్నారు.


