మందపై దూసుకెళ్లిన వాహనం
●45 గొర్రెల మృతి
బెళుగుప్ప: మండలంలోని కాలువపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం గొర్రెల మందపై ట్యాక్సీ దూసుకెళ్లిన ఘటనలో 45 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు... ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి తనకున్న ఐదు ఎకరాల పొలాన్ని విక్రయించగా వచ్చిన డబ్బుతో గొర్రెల పెంపకాన్ని చేపట్టాడు. మేపు కోసం ఇతర ప్రాంతాలనకు మందను తోలుకెళ్లిన ఆయన కాపరులతో కలసి తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున కాలువపల్లి వద్దకు చేరుకున్నాడు. జాతీయ రహదారిపై రోడ్డుకు పక్కగా గొర్రెలను తోలుకెళుతూ మార్గమద్యంలో వంతెనను దాటిస్తుండగా.. వెనుక నుంచి మందపైకి శరవేగంగా ఓ ట్యాక్సీ దూసుకెళ్లింది. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కాపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సింధనూరు జాతికి చెందిన 45 గొర్రెలు మృతి చెందాయి. కళేబరాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఘటనతో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుని బాధితుడు నాగేశ్వరరరెడ్డికి ధైర్యం చెప్పారు. జీవనాధరమైన పొలాన్ని విక్రయించి, గొర్రెల పోషణ చేపట్టిన రైతు నాగేశ్వరరెడ్డిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలంటూ గ్రామస్తులతో కలసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మూడు గంటలకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉరవకొండ రూరల్ సీఐ మహానంది, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, బెళుగుప్ప ఎస్‌ఐ శివ తదితరులు అక్కడకు చేరుకుని ఆందోళకారులతో మాట్లాడి, న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు. ఘటనపై గొర్రెల యజమాని నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


