ట్రాక్టర్ బోల్తా – యువకుడి దుర్మరణం
మడకశిర రూరల్: ప్రమాదవశాత్తు రోటావేటర్ కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... గుడిబండ మండలం పీసీ గిరి గ్రామానికి చెందిన బండిమనే తిప్పన్న కుమారుడు యంజేరప్ప (31)కు కోతులగుట్ట గ్రామానికి చెందిన గాయత్రితో వివాహమైంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రెప్‌గా పనిచేస్తున్న యంజేరప్ప.. ఇటీవల భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కుటుంబంతో కలసి అత్తారింటికి వచ్చాడు. ఆదివారం ఇంటి పట్టున ఖాళీగా ఉండలేక బామ్మర్ది మల్లికార్జునగౌడ్‌తో కలసి పొలానికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరుగు ప్రయాణమై.. హంద్రీనీవా కాలువ వద్ద ఇంటికి వెళ్లే మలుపులో ట్రాక్టర్‌ను తిప్పుతుండగా అదుపు తప్పి బోల్తాపడింది. డ్రైవర్ పక్కన కూర్చొన్న మల్లికార్జున పక్కకు దూకడంతో స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ నడుపుతున్న యంజేరప్ప రోటోవేటర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లావణ్య తెలిపారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
గుడిబండ: ప్రమాదంలో మృతిచెందిన యంజేరప్ప మృతదేహానికి రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, రొళ్ల మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ నరసింహారెడ్డి, పలువురు నాయకులు నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న వారు ఆదివారం మృతుడి నివాసానికి చేరుకున్నారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు.


