క్రికెటర్ దీపికకు ఘన స్వాగతం
మడకశిర/అమరాపురం: అంధుల మహిళల టీ20 ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అమరాపురం మండలం తంబాలహట్టి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల కొలంబోలో జరిగిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి కప్‌ను కై వసం చేసుకోవడంతో కెప్టెన్ దీపిక దేశానికి పరిచయమయ్యారు. దీపిక వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తంబాలహట్టికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆమైపె పూల వర్షం కురిపించి.. హారతులు పట్టారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎస్‌ఐ ఇషాక్‌బాషా ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నేడు మడకశిరలో సన్మానం ..
అంధుల మహిళల టీ20 ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ దీపిక సోమవారం మడకశిరకు వస్తున్నారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తొలిసారిగా మడకశిరకు వస్తున్న నేపథ్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
ఏఈఆర్‌ఓలకు షోకాజ్
అనంతపురం అర్బన్: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా (ఏఈఆర్‌ఓ) వ్యవహరిస్తున్న తహసీల్దార్లు, ఎంపీడీఓలకు కలెక్టర్ ఆనంద్ శనివారం షోకాజ్ జారీ చేశారు. ఈ నెల 15లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 2022లో ఉన్న ఓటర్లను ప్రస్తుత ఓటర్లతో మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇప్పటికే పలుమార్లు ఆదేశించారు. అయిన్పటికీ అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో 30 శాతం కంటే తక్కువగా మ్యాపింగ్ జరిగిన మండలాల ఏఈఆర్‌ఓల తీరును కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో అనంతపురం అర్బన్ నియోజవకర్గం పరిధిలో ఏఈఆర్‌ఓలుగా ఉన్న అనంతపురం రూరల్ తహసీల్దారు (16.39 శాతం), ఎంపీడీఓ (12.029 శాతం), రాప్తాడు నియోజకవర్గం పరిధిలో చెన్నేకొత్తపల్లి తహసీల్దారు (28.135 శాతం), రాప్తాడు ఎంపీడీఓ (27.323 శాతం) షోకాజ్ నోటీసు అందుకున్నారు. మ్యాపింగ్ తక్కువగా జరగడంపై ఈ నెల 15వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని నోటీసులో హెచ్చరించారు.


