ప్రజా ఉద్యమం..ఉధృతం
సాక్షి నెట్‌వర్క్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం జిల్లాలో ఉధృతంగా కొనసాగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతిచోట ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. మెడికల్ కళాశాలల అంశంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్యను దూరం చేసే ఆలోచనలను మానుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జిల్లాలో పలుచోట్ల చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. హిందూపురం తొమ్మిదో వార్డులో వైఎస్సార్‌సీపీ నేతలు సంతకాలు సేకరించారు. 21వ వార్డులో వార్డు ఇన్‌చార్జ్ న్యాతరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ సువర్ణ, మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. మడకశిర మండలం గౌడనహళ్లిలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, వక్కలిగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తనకల్లు మండలంలోని మల్లిరెడ్డిపల్లి, నడిమికుంటపల్లి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి సంతకాలు సేకరించారు.
సంతకాల సేకరణకు విశేష స్పందన


