పల్లెకు ఝలక్
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పంచాయతీలోని సుబ్బరాయనిపల్లి, గువ్వలగుట్టపల్లి, బత్తలపల్లి గ్రామాలకు చెందిన వందకు పైగా కుటుంబాలు ఆ పార్టీని వీడాయి. గువ్వలగుట్టపల్లి బస్టాండు సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నెంబర్ 763లోని ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గువ్వలగుట్టపల్లికి చెందిన ఓ నాయకుడికి కట్టబెడుతుండడం చూసిన జనం టీడీపీకి షాకిచ్చారు. ఈ భూముల వ్యవహారానికి సుబ్బరాయనిపల్లికి చెందిన మరో నాయకుడు వత్తాసు పలుకుతుండడంతో సదరు గ్రామంలో సైతం పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడారు. ఎంతో కాలంగా టీడీపీకి ఊడిగం చేశామని, ఇప్పటికీ తమకు న్యాయం చేయకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు చెబుతున్నారు. పెడపల్లి రెవెన్యూ గ్రామంలో గువ్వలగుట్టపల్లి వద్ద జాతీయ రహదారికి ఆనుకొని సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొందరు నాయకులు ఆక్రమించుకోవాలని చూశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తీసుకురావడంతో స్థానిక బీజేపీ నాయకులు స్పందించి మంత్రి సత్యకుమార్‌ను కలిసి సదరు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. దీంతో ఆయన అధికారులను ఆదేశించడంతో సదరు భూమిలో చదును చేసే పనులు ఆపగలిగారు. ఎంతో కాలంగా గ్రామంలో ఉన్న తమకు కాకుండా ఓ కాంట్రాక్టర్‌కు, భూస్వామికి ప్రభుత్వ భూమి అప్పనంగా ఇస్తుంటే చూస్తూ ఉండాలా అంటూ స్థానికులు ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం వారంతా పెడపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ పంచన చేరడంతో ‘పల్లె’కు ఝలక్ ఇచ్చినట్లు అయింది.
టీడీపీని వీడిన
పెడపల్లి పంచాయతీ వాసులు
వంద కుటుంబాలకు పైగా
పార్టీకి గుడ్‌బై
పల్లె విధానాలు నచ్చకనే
దూరమైనట్లు స్పష్టీకరణ


