గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం
గీసుకొండ: జాతీయ ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధిని శ్రీసత్యసాయి జిల్లా అగళి, అనంతపురం జిల్లా పుట్లూరు మండలాలకు చెందిన కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు శుక్రవారం అధ్యయనం చేశారు. రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్టు సీనియర్ ట్రస్టీ రామాంజనేయులు, రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఓబులేసు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు నాగమణి, ఆంజనేయులు, బాలవికాస సీనియర్ అసోసియేట్ కొట్టె రమాదేవితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామం సాధించిన ప్రగతి, విజయాలను జిల్లా ట్రైనింగ్ మేనేజర్లు కూసం రాజమౌళి, వనపర్తి కరుణాకర్ వివరించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు మేడిద సుశీల, గూడ సరోజన తదితరులు పాల్గొన్నారు.
చెక్‌బౌన్స్ కేసులో ఏడాది జైలు
అనంతపురం: చెక్ బౌన్స్ కేసులో ఏకంగా రూ.9 కోట్ల నగదు చెల్లింపుతో పాటు ముద్దాయిలకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ అనంతపురం ఫస్ట్ క్లాస్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శివశంకర్ తీర్పు వెలువరించారు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన ఆదినారాయణ వద్ద శ్రీలక్ష్మి (ఎన్‌ఆర్‌ఐ), అమిలినేని నరేష్ దంపతులు ఐదేళ్లక్రితం రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ క్రమంలో అప్పు వెనక్కి చెల్లిస్తున్నట్లుగా వారు అందజేసిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితుడు అనంతపురం ఫస్ట్ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తుది వాదనలు విన్న అనంతరం శుక్రవారం తీర్పు వెలువడింది. వడ్డీతో సహ మొత్తం రూ.9 కోట్లు వెనక్కు చెల్లించడంతో పాటు ముద్దాయిలు శ్రీలక్ష్మి, అమిలినేని నరేష్ ఏడాది జైలు శిక్ష అనుభవించాలంటూ న్యాయమూర్తి తీర్పు వెలురించారు.
రేపు ‘కవికాకి’ శతజయంతి ఉత్సవాలు
అనంతపురం కల్చరల్: స్థానిక ఎన్‌జీఓ హోంలో ఆదివారం ఉదయం కవి కాకి కోగిర సీతారామ్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. కోగిర సీతారామ్ సమకాలిక కవులు ఏలూరు యంగన్న, రాజారాంతో పాటు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ, డాక్టర్ రాధేయ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైన కోగిర జీవిత విశేషాలపై ప్రసంగించనున్నారు. అలాగే పద్యకవిత్వంపై వేదాద్రి చంద్రశేఖర్, వచన కవిత్వంపై డాక్టర్ అంకె శ్రీనివాస్, బాలసాహిత్యంపై ప్రజ్ఞా సురేష్, కోగిర జయచంద్ర, రాయుడు, కొత్తపల్లి సురేష్ తదితరులు ప్రసంగించనున్నారు.
అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా సింగపూర్ నుంచి విచ్చేసిన భక్తులు శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సంగీత విభావరి నిర్వహించారు. సత్యసాయిని కొనియాడుతూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు.
గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం
గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం


