మొక్కజొన్న రైతు కుదేలు
గోరంట్ల: ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలయ్యారు. జిల్లా వ్యాప్తంగా 30,713 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. గోరంట్ల మండలంలోనే అత్యధికంగా 6,454 ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగుచేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ దాదాపు 2,14,991 క్వింటాళ్ల దిగుబడిని రైతులు సాధించారు.
కొనుగోలుకు ముందుకు రాని
చంద్రబాబు సర్కార్..
పంట సాగుకు ముందు ధరలు ఆశాజనకంగా ఉండడంతో జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా రైతులు మొక్కజొన్న సాగు చేశారు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. క్వింటా మొక్కజొన్నకు చంద్రబాబు ప్రభుత్వం రూ.2400 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ప్రభుత్వం దగా చేసింది. దీంతో ప్రైవేట్ వ్యాపారులు కుమ్మకై క్వింటా మొక్కజొన్నను రూ.1,700 కు మించి కొనుగోలు చేయడం లేదు. ఈ ధరతో పంటను విక్రయిస్తే కనీసం పెట్టుబడులు సైతం చేతికి అందవని రైతులు వాపోతున్నారు. దీంతో చాలా మంది రైతులు మొక్కజొన్న బస్తాలను ఇళ్లలో నిల్వ చేసుకోగా, మరికొందరు రైతులు కల్లాల్లోనే ఆరబోస్తున్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరతో మొక్కజొన్న దిగుబడులు కొనుగోలు చేయాలంటూ రైతులు బయపరెడ్డి, నారాయణప్ప, జయచంద్రారెడ్డి తదితరులు కోరుతున్నారు.
గిట్టుబాటు కాని ధర
క్వింటా రూ.2400తో
మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో
నిర్లక్ష్యం
కొనుగోలుకు ప్రభుత్వం
అనుమతించలేదు
ఈ ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటకు క్వింటా రూ.2,400తో కొనుగోలు చేసేలా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అనుమతులు రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – శివశంకర్‌నాయక్,
మండల వ్యవసాయాధికారి, గోరంట్ల
మొక్కజొన్న రైతు కుదేలు


