● యాడుండావ్ నాయనా! ఓసారి వచ్చిపో..
తలుపుల: ఇది ఓ కన్నతల్లి అరణ్య రోదన. ఉన్న ఊళ్లో ఉపాధి దొరక్క... బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడి ఆచూకీ తెలియక కన్నీటి పర్యంతమవుతోంది. వివరాల్లోకి వెళితే.. తలుపుల మండలం కొవ్వూరివాండ్లపల్లిలోని దళిత వాడకు చెందిన శాంతమ్మ, గంగయ్య దంపతులకు ఏకై క కుమారుడు రామచంద్ర ఉన్నాడు. రామచంద్ర చిన్నప్పుడే తండ్రి మరణించాడు. అప్పటి నుంచి కుమారుడికి కష్టమనేది తెలియకుండా తల్లి పెంచి పోషించింది. ప్రస్తుతం రామచంద్రకు 28 ఏళ్లు. తాను ఏదైనా పని చేసి తల్లిని బాగా చూసుకోవాలని అనుకున్నాడు. చాలా ప్రయత్నాలు చేసినా ఎక్కడేగాని ఉపాధి అవకాశాలు దక్కలేదు. దీంతో హైదరాబాద్‌కు చెందిన బోరువెల్ నిర్వాహకుడు శ్రీనివాసులురెడ్డిని కలసి ఆయన కంపెనీ తరఫున సౌత్ ఆఫ్రికాలో పనికి వెళ్లాడు. ఏడాదిగా సౌత్ ఆఫ్రికాలోనే ఉంటున్నాడు. రోజూ తల్లికి ఫోన్ చేసి ఆమె బాగోగులు అడిగి తెలుసుకునేవాడు. తిరిగి వచ్చేయాలని, ఇక్కడే ఏదోక పని చేసుకుని బతుకుదామని తల్లి చెబుతూ వచ్చేది. ఈ క్రమంలోనే గత నవంబర్ 23వ తేదీ వరకూ ఫోన్‌లో టచ్‌లో ఉన్న రామచంద్ర.. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. దేశం కాని దేశంలో తన బిడ్డకు ఏం కష్టమొచ్చిందోననే ఆందోళన ఆమెలో మొదలైంది. దీంతో హైదరాబాద్‌కు వెళ్లి శ్రీనివాసులురెడ్డిని కలసి తన గోడు వెళ్లబోసుకుంది. అయితే అతను పట్టించుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగి ఇంటికి చేరుకుంది. ప్రభుత్వం స్పందించి బిడ్డను తన వద్దకు చేర్చాలని శాంతమ్మ వేడుకుంటోంది.
● యాడుండావ్ నాయనా! ఓసారి వచ్చిపో..


