12న కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల ధర్నా
పుట్టపర్తి అర్బన్/టౌన్: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12న కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు ధర్నా నోటీసును బుధవారం జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఐసీడీఎస్ పీడీ ప్రమీలకు అందజేసి, మాట్లాడారు. మొబైల్ యాప్‌ల భారం తగ్గించాలని, సకాలంలో వేతనాలు మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులను అందించాలని, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని, కోరారు. ఇవే డిమాండ్ల సాధనకు గతంలో 42 రోజుల పాటు సమ్మెలోకి వెళితే... ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు తాము అధికారంలోకి వస్తే సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా... నేటికీ అంగన్‌వాడీల సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మోసంపై ఈ నెల 12న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని అంగన్‌వాడీలకు పిలుపునిచ్చారు. కార్యక్రంమలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, డిప్యూటీ సెక్రెటరీ వెంకటేషు, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మాబున్నీషా, కార్యదర్శి సంపూర్ణమ్మ, దేవి, భాగ్యలక్ష్మి, చంద్రకళ, రమాదేవి, షామీరా, శకుంతల తదితరులు పాల్గొన్నారు.


