ప్రపంచ శాంతికి పాటుపడదాం
● సర్వమతాల సారం ఒక్కటే
● బాబయ్య దర్గా పీఠాధిపతి
తాజ్‌బాబా పిలుపు
పెనుకొండ: సర్వమతాల సారం ఒక్కటేనని, ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ప్రపంచశాంతికి పాటుపడాలని బాబయ్య దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా పిలుపునిచ్చారు. బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దర్గా ఆవరణలో సర్వమత సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా మాట్లాడుతూ... ప్రస్తుతం అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవిస్తోందన్నారు. ఇది మానవ జాతి మనుగడకు పెద్ద కీడుగా మారిందన్నారు. ఏ దేశంలో మతసామరస్యం వెల్ల్లివిరిస్తుందో అక్కడ శాంతి పరిఢవిల్లుతుందని, ఆ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం పలువురు మత పెద్దలు జాతీయ సమైక్యత గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో సిక్కు మఠాధిపతి జగ్‌జ్యోత్‌సింగ్, కవులు తులసీదాస్, ముద్దరంగప్ప, అతావుర్ షాబుద్దీన్, జాన్ ప్రియనాథ్, జాబిలి చాంద్‌బాషా, ఉమర్ ఫారూక్‌ఖాన్, ఉల్గార్ దర్గా పీఠాధిపతి మదని తదితరులు పాల్గొన్నారు.
దీపారాధనకు పోటెత్తిన భక్తులు
బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన దీపారాధన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి దీపారాధనకు టెంకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మండుతున్న అగ్ని గుండంలో టెంకాయలు వేసి మైమరచిపోయారు.
ప్రపంచ శాంతికి పాటుపడదాం


