పట్టు రైతుల ఉద్యమ బాట
మడకశిర: ప్రోత్సాహకాలు అందించడంలో చంద్రబాబు సర్కారు తీరును నిరసిస్తూ రాష్ట్ర పట్టు రైతుల కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పట్టు రైతులు ఉద్యమబాట పట్టనున్నారు. రైతులు రెండు రకాల పట్టుగూళ్లు పండిస్తారు. మొదటిది బైవోల్టిన్, రెండోది సీబీ (క్రాస్ బ్రీడ్)రకం పట్టుగూళ్లు. సీబీ రకం పట్టుగూళ్లను రెండు శాతం మంది రైతులు మాత్రమే పండిస్తారు. బైవోల్టిన్ పట్టుగూళ్లను 98 శాతం మంది పండిస్తారు. పట్టుగూళ్ల మార్కెట్లలో విక్రయించిన రెండు రకాల పట్టుగూళ్లకు ప్రభుత్వం ప్రతి కిలోకూ ప్రోత్సాహకం అందిస్తుంది. ప్రధానంగా సీబీ రకం పట్టుగూళ్లకు కిలోకు రూ.10, బైవోల్టిన్ రకానికి రూ.50 చొప్పున ప్రోత్సాహం కింద చెల్లించాలి. అయితే రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరాక పట్టు రైతులకు ప్రోత్సాహక నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే బకాయిలన్నీ విడుదల చేసి ఆదుకుంటామని చెప్పి మాట తప్పారని పట్టు రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.80 కోట్లు ‘ప్రోత్సాహకం’ బకాయిలు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు రూ.33 కోట్ల దాకా బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు.
బైవోల్టిన్ పట్టు రైతులకు
అందని ప్రోత్సాహకం
పేరుకుపోయిన
కోట్లాది రూపాయల బకాయిలు
ఏడాదిన్నర అవుతున్నా
కరుణించని చంద్రబాబు సర్కార్
పట్టు రైతుల ఉద్యమ బాట


