మహిళలకు రక్షణ కరువు
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, అమ్మాయిలపై ఈవ్‌టీజింగ్‌లు పెరిగిపోతున్నాయన్నారు. బాధితుల పక్షాన నిలిచి న్యాయం చేయాల్సిన పోలీసులు నిందితులకు వత్తాసు పలకడం ఎంతమాత్రమూ కరెక్టు కాదని అన్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో మహిళలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని కోరుతూ బాధితులతో కలిసి సోమవారం పుట్టపర్తిలో ఎస్పీ సతీష్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పోలీస్ కార్యాలయం ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు, అమ్మాయిలపై దాడులు జరిగినప్పుడు పోలీస్‌స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయకుండా తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాప్తాడులో అంగన్‌వాడీ కార్యకర్తను దారుణంగా కొట్టినా, సోమందేపల్లిలో ఎంపీటీపీ శివమ్మపై దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని ఎండగట్టారు. హిందూపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ అల్లరి మూకలు దాడి చేస్తే కొంతమందిపై మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం జీరో ఎఫ్‌ఐఆర్, దిశ యాప్ అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి వ్యవస్థ లేకపోవడంతో మహిళలకు భద్రత కరువవుతోందన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మహిళల గురించి గొప్పగా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహామండలి మాజీ చైర్మన్ అవుటాల రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, జిల్లా అధికార ప్రతినిధి ఫొటోసాయి తదితరులు పాల్గొన్నారు.
దాడులు, దౌర్జన్యాలపై ఉదాసీనత తగదు
బాధితుల పక్షాన నిలవకుండా..
నిందితులకు వత్తాసేంటి?
ఎస్పీని కలిసి విన్నవించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


