ప్రభుత్వ కుంటలో పనులు ఆపాలి
రొద్దం: మండలంలోని రొద్దకంపల్లి గ్రామంలో ఉన్న అంగజాల కుంట కొందరి స్వార్థం కారణంగా ఉనికి కోల్పోతుందని, జేసీబీలను ఏర్పాటు చేసి కుంట కట్టను తొలగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే కుంటలో పనులు ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి సవితకు వినతి పత్రం అందజేశారు. సోమవారం రొద్దం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతులు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 97లో 16 ఎకరాల్లో విస్తరించిన అంగజాల కుంటను కొందరు అక్రమించుకుని కట్టను చదును చేస్తున్నారని వివరించారు. కుంటకు సంబంధించిన రికార్డులు పరిశీలించి తనకు పంపాలని ఆర్టీఓ ఆనంద్‌కుమార్, తహసీల్దార్ ఉదయశంకర్‌రాజుకు సూచించారు. కార్యక్రమంలో రొద్దం గ్రామ దళిత వాడకు చెందిన రైతులు, రొద్దకంపల్లి గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.
పరిష్కార వేదికలో మంత్రి సవితకు రైతుల వినతి


