కార్పొరేట్‌కు ఊతమిచ్చేలా సర్కారు నిర్ణయాలు
కదిరి: విద్యా రంగంలో చంద్రబాబు సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఊతమిచ్చేలా ఉన్నాయని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి విమర్శించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాదరెడ్డి అధ్యక్షతన ఆదివారం కదిరిలో జరిగిన ఆ శాఖ జిల్లా 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క సమస్యపై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. విద్యారంగంలోని సమస్యలపై చర్చించేందుకు మంత్రి లోకేష్ ముందుకు రావాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లు సైతం టెట్ పాస్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని, దీనిపై గతంలో ఇచ్చిన జీఓ 51కి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అసెస్‌మెంట్ పుస్తకాలు, సిలబస్‌కు సంబంధం లేకుండా ప్రశ్నపత్రాల రూప కల్పన, ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. టీచర్లను పూర్తిగా బోధనకే పరిమితం చేయాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామమోహన్, జిల్లా ప్రధాన, ఆర్థిక కార్యదర్శులు గోపాల్‌నాయక్, జయకృష్ణ, జవహర్ తదితరులు పాల్గొన్నారు.
18 నెలల పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు
ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి


