ప్రేమ పేరుతో వంచన
● యువకునిపై పోక్సో కేసు
బత్తలపల్లి: ప్రేమ పేరుతో బాలికను వంచించిన యువకునిపై పోక్సో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ధర్మవరం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. బత్తలపల్లి మండలం దంపెట్లకు చెందిన ఈడిగ హరీష్ ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వెంట తీసుకెళ్లి మోసం చేశాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేసింది. ఈ మేరకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ధర్మవరం రూరల్ సీఐ తెలిపారు. నిందితుడు హరీష్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితునికి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
ధర్మవరం: పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. డీఎల్‌ఆర్ కాలనీకి చెందిన కొండారెడ్డి (49)కు మద్యం అలవాటుంది. శనివారం గాంధీనగర్ రైల్వే గేటు సమీపంలోని లక్ష్మీనగర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని జేబులో చీప్ లిక్కర్ మద్యం బాటిల్ ఉంది. అతిగా మద్యం తాగి మృతి చెందాడా.. ఇంకేమైనా జరిగిందా అన్నది టూటౌన్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కొండారెడ్డికి భార్య లలితమ్మ ఉంది.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
మడకశిరరూరల్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం ఆమె భక్తరపల్లిలో ఆరోగ్య ఉపకేంద్రం, నీలకంఠాపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అలాగే ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని సందర్శించి, వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఆదివారం నుంచి వారం రోజులపాటు జరిగే భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని కోరారు. ఉత్సవాల్లో పాటించాల్సిన సూచనలు, సలహాలను వైద్య సిబ్బందికి వివరించారు. వైద్య చికిత్సల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
జూడోలో ‘అనంత’
క్రీడాకారులకు స్వర్ణాలు
ధర్మవరం రూరల్: జూడో పోటీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన క్రీడాకారులు స్వర్ణ పతకాలతో మెరిశారు. ధర్మవరం మండలం చిగిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–19 బాల బాలికల జూడో పోటీల్లో వీరు ఆద్యంతం అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇప్పటి వరకు 27 పోటీల్లో మొత్తం 13 బంగారు పతకాలు సాధించారని పీడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ అడ్డగింత
పరిగి: ఊటుకూరులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం వేకువజామునే గ్రామ పరిధిలోని పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులంతా ఏకమై నదిపై ఉన్న వంతెన వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఇసుకతో వస్తున్న ట్రాక్టరును వంతెన వద్ద అడ్డగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నేను చెప్పినట్టు వినవా..?
సాక్షి టాస్క్‌ఫోర్స్: నేను చెప్పినట్టు వినవా అంటూ.. అయితే నీకు నేనేంటో చూపిస్తా అంటూ కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామ సచివాలయ ఉద్యోగిపై టీడీపీ ఎంపీటీసీ కేశవరెడ్డి బెదిరింపులకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన) కింద ఇళ్లను మంజూరు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. సొల్లాపురంలో అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటన్నింటినీ సిబ్బంది యాప్‌లో నమోదు చేయాలి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ కేశవరెడ్డి సచివాలయం వద్దకెళ్లి ఓ ఉద్యోగిపై పది మంది చూస్తుండగా నోరుపారేసుకున్నారు. ‘నా కనుసన్నల్లో నీవు పని చేయాలి... నేను చెప్పినట్లు చేయాలి.. లేదంటే మండల మీట్‌లో నేనేంటో చూపిస్తా’ అంటూ గదమాయించారు.
ప్రేమ పేరుతో వంచన
ప్రేమ పేరుతో వంచన


