తల్లీబిడ్డల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు
హిందూపురం: తల్లీబిడ్డ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ ఫైరోజాబేగం అన్నారు. గర్భవతిగా ఉన్నపుడే తల్లీబిడ్డ ఆరోగ్యం, ప్రసవం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సిబ్బందికి సూచించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో గురువారం నవజాతి శిశువు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై పెనుకొండ డివిజన్ అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణితో కలిసి డీఎంహెచ్‌ఓ శనివారం క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి బిడ్డ మరణించే వరకు జరిగిన పరిణామాల గురించి బాధిత మహిళ దివ్యశ్రీని అడిగి తెలుసుకున్నారు. బిడ్డ ఏడుస్తున్నా సిబ్బంది పట్టించుకోలేదని, పారాసిటమాల్ ఇచ్చారని, ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియలేదని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత చిన్న పిల్లల విభాగంలోని వైద్యులతోనూ నవజాత శిశువు మృతిపై డీఎంహెచ్‌ఓ ఆరా తీశారు. అనంతరం డ్యూటీ డాక్టర్లు కీర్తి, శివకుమార్, ఇన్‌చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ బాబా బుడేన్, డాక్టర్ కేసీకే నాయక్‌తో సమావేశమై శిశువు మృతిపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సిబ్బందికి సూచనలిస్తూ డీఈఐసీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ నాయక్, వైద్యాధికారి విజయకుమార్‌తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం
నవజాత శిశువు మృతిపై విచారణ


