సైనిక కుటుంబాలకు అండగా నిలవాలి
ప్రశాంతి నిలయం: దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. సాయుధ దళాల ఫ్లాగ్ డేని పురస్కరించుకుని సంక్షేమ నిధికి సంబంధించిన కార్ ఫ్లాగ్‌లను, స్టిక్కర్లను ఆయన శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాలు దేశ సరిహద్దులలో నిరంతరం పహారా కాస్తూ ప్రజల రక్షణలో సేవ చేస్తున్నారన్నారు. సైనికులు, మాజీ సైనికులు యుద్ధ సమయంలో, విపత్తుల సమయంలో దేశానికి అండగా ఉంటున్నారన్నారని, వారికి ప్రజలందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సైనికుల సేవలకు గుర్తింపుగా పౌర సమాజం ఇచ్చే గౌరవ చిహ్నంగా ఈ ఫ్లాగ్ డే నిర్వహించుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్ ఫ్లాగ్‌లు 5వేలు, స్టిక్కర్లు 3,500 అందుబాటులో ఉంచామని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి.తిమ్మప్ప కలెక్టర్‌కు వివరించారు. కార్ ఫ్లాగ్ రూ.5, స్టిక్కర్ ఒక్కటి రూ.2గా ధర నిర్ణయించామని, ప్రజలు స్వచ్ఛందంగా కొనుగోలు చేసి సాయుధ దళాల పతాక దినోత్సవానికి విరివిగా విరాళాలు అందజేయాలన్నారు. ఆసక్తి కలిగిన వారు ‘జిల్లా సైనిక సంక్షేమ అధికారి, అనంతపురం,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నంబర్ 62076956433, ఐఎఫ్‌ఎస్‌సీ ఎస్‌బీఐ ఎన్0021438’కు నగదు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ సీహెచ్ పురుషోత్తం, సైనిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


