మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్
● నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
● అభ్యంతరాలకు 30 రోజులు అవకాశం
మడకశిర: నియోజకవర్గంలోని ఐదు మండలాలతో మడకశిర కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నూతన రెవెన్యూ డివిజన్‌లో మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలు ఉండనున్నాయి. ఇంతకుముందు ఈ మండలాలన్నీ పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేవి. అయితే కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ మండలాల నుంచి రెవెన్యూ డివిజన్‌కు వచ్చేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నూతన రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం మడకశిర కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రజలు తమ అభ్యంతరాలు చెప్పడానికి ప్రభుత్వం 30 రోజులపాటు అవకాశం కల్పించింది.
7న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
పుట్టపర్తి అర్బన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షను డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు డీఈఓ కిష్టప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,697 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు www.bse. ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ‘మన మిత్ర’ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పాఠశాల యూడైస్ లాగిన్ నుంచి కూడా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసే అవకాశం ఉందన్నారు. ఏవైనా సవరణలు ఉంటే పాఠశాల హెచ్‌ఎం ధ్రువీకరణ లేఖతో పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్‌ను కలిసి నామినల్ రోల్‌లో నమోదు చేయించాలన్నారు. హాల్ టికెట్‌లో ఉన్న క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చన్నారు. పరీక్షా సమయానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ సూచించారు.
అర్హులైన ఖైదీలకు న్యాయసాయం
● జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి
రాజశేఖర్
హిందూపురం/పెనుకొండ: ఆర్థిక స్థోమత కారణంగా లాయర్లను ఏర్పాటు చేసుకోలేని అర్హులైన ఖైదీలకు న్యాయసాయం అందిస్తామని జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన హిందూపురంలోని సబ్‌జైలును అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి కేసుల గురించి తెలుసుకున్నారు. కుటుంబీకులతో ములాఖాత్‌కు అవకాశం కల్పిస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం భోజనానికి ఉపయోగించే నిత్యావసరాలు, కూరగాయల నాణ్యతలను పరిశీలించారు. సబ్‌జైలులో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సబ్‌జైలు అధికారి హనుమప్ప, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, రాజు, పారా లీగల్ వలంటీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పెనుకొండ లోక్ అదాలత్ చైర్మన్ వాసుదేవన్‌తో కలిసి పెనుకొండ సబ్ జైలును తనిఖీ చేశారు.
వేణురెడ్డికి
మధ్యంతర బెయిల్
చిలమత్తూరు: వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక భర్త , వైఎస్సార్ సీపీ నాయకుడు వేణురెడ్డికి ఏపీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 15న టీడీపీ అల్లరిమూకలు హిందూపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం చేశాయి. ఈ ఘటనకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు....టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు వైఎస్సార్ సీపీ నేతలపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో వేణురెడ్డితో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి. దీంతో వేణురెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు మిగతా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేశారని క్వాష్ పిటిషన్ వేశారు. విచారించిన న్యాయ స్థానం...వేణురెడ్డితో పాటు మిగతావారిపై నమోదైన కేసు విచారణ జరిగే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. వేణురెడ్డితో పాటు మిగతా వారికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.


