చీర ఎన్ని రోజుల్లో నేస్తారు?
ధర్మవరం: ‘‘పట్టు చీర తయారీకి ముడిసరుకులు ఏం వాడతారు, ఎన్ని రోజులు పడుతుంది, గిట్టుబాటు అవుతుందా’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఆయన ధర్మవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా హ్యాండ్‌లూమ్స్, పవర్‌లూమ్స్‌లలో పట్టుచీరల తయారీ విధానం, డిజైనింగ్, రీలింగ్, డయింగ్ తదితర వాటిని పరిశీలించారు. చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేతలు తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం కలెక్టర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హాస్టల్‌ను తనిఖీ చేశారు. భోజనం, వసతి, ఇతర సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సురేష్‌బాబు, హ్యాండ్‌లూమ్ ఏడీ రామకృష్ణ, డీఓ రమణారెడ్డి, ఏడీఓలు సుబ్బరాయుడు, శీనానాయక్, డిజైనర్ నాగరాజు, పట్టుచీరల యూనిట్ నిర్వాహకులు జింకా రామాంజనేయులు, గుద్దిటి ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.
‘మీ డబ్బు– మీ హక్కు’పై
అవగాహన కల్పించాలి
ప్రశాంతి నిలయం: పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాల్లో నిల్వ ఉన్న డబ్బును తిరిగి పొందేందుకు ఆర్‌బీఐ చేపట్టిన ‘మీ డబ్బు– మీ హక్కు’ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో లావాదేవీలు నిలిచిపోయిన బ్యాంకు ఖాతాలు 2,88,083 ఉన్నాయని, ఆయా ఖాతాల్లో రూ.66.95 కోట్ల నగదు ఉందన్నారు. ఈ నిధులు బ్యాంకుల నుంచి ఆర్‌బీఐకి మళ్లాయన్నారు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్న వారు ఆధార్, పాన్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో సమీపంలోని బ్యాంకును సంప్రదించి ఈ–కేవైసీ పూర్తి చేయాలన్నారు. బ్యాంక్ ఖాతాలు పునరుద్ధరించిన తర్వాత, ఆర్‌బీఐతో పరస్పర ధ్రువీకరణ ప్రక్రియ అనంతరం సంబంధిత వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందన్నారు. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో వారసులు డెత్ సర్టిఫికెట్, కుటుంబ సభ్యుల అంగీకార పత్రంతో పాటు బ్యాంక్ అధికారులు కోరిన ఆధారాలను సమర్పిస్తే అన్‌క్లెయిమ్డ్ నగదును పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
5న మెగా పేరెట్స్, టీచర్స్ మీట్..
డిసెంబర్ 5న జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. మెగా పీటీఎంలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం, హాజరు, ప్రవర్తన తదితర అంశాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. అందువల్ల తల్లిదండ్రులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలన్నారు. సమావేశంలో డీఈఓ క్రిష్టప్ప, సమగ్ర శిక్ష ఏపీసీ దేవరాజు, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
చేనేత కార్మికులతో కలెక్టర్ మాటామంతీ
చీర ఎన్ని రోజుల్లో నేస్తారు?


