మెడికల్ కాలేజీలను కాపాడుకుందాం
పరిగి: పేదలకు మేలు చేసే మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుందామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె.. పరిగిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. భావితరాల భవిష్యత్‌ను చందబ్రాబు సర్కార్ కాలరాస్తోందని, దీన్ని కాపాడేందుకే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేశారన్నారు. ఈ క్రమంలోనే గ్రామ గ్రామానా విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా పేదకుటుంబాల్లోని విద్యార్థుల డాక్టర్ కల నెరవేర్చడంతో పాటు నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ఏకంగా 17 మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో ఐదు మెడికల్ కళాశాలలను కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. మిగతా కళాశాలలను పూర్తి చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ పేరుతో పేదలను పీల్చి పిప్పి చేసి పిండుకోవడం చంద్రబాబు నైజమన్నారు. దీన్ని గుర్తించిన ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అందరం ఏకమై మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఎంపీపీ సవిత, పలువురు సర్పంచ్‌లు, వైస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్ పిలుపు


