అంతులేని కష్టంలోనూ..
తరగని రైతన్న దాతృత్వం
పెద్దపప్పూరు: తుఫానులు, కరువులు, ప్రకృతి విపత్తులు వంటి అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ తన శ్రమతో సమాజానికి ఆహారాన్ని అందించడంలో రైతుల పాత్ర అత్యంత కీలకం. ఇది వారిలోని అచంచలమైన ఆత్మస్థైర్యాన్ని, పట్టుదలను తెలియజేస్తోంది. అందుకే రైతన్నలు దేశానికి వెన్నెముక అని అంటారు. వారి కష్టం, శ్రమ దేశానికి అన్నం పెట్టడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థనూ బలోపేతం చేస్తుంది. అలాంటి రైతు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కుదేలయ్యాడు. అరటి పంట పండిందన్న సంతోషం ఓ వైపు ఉన్నా.. గిట్టుబాటు ధర కల్పనలో ప్రభుత్వం విఫలం చెందడంతో రూ.లక్షల్లో నష్టపోతున్నాడు. ఇంతటి కష్టంలోనూ పెద్దపప్పూరు మండలం షేక్‌పల్లి అరటి రైతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అరటి పంటను వృథాగా వదిలేయకుండా మూగజీవాల ఆకలి తీర్చాలని నిర్ణయించుకుని యాడికి మండలం కత్తిమానిపల్లిలోని గొర్రెల కాపరులకు ఫోన్ చేసి జీవాల మేత కోసం అరటి గెలలను ఉచితంగా తీసుకెళ్లాలని సూచించారు. దీంతో గొర్రెల కాపరులు అద్దెకు ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని గురువారం అరటి గెలలను లోడు చేసుకుని వెళ్లారు. రైతుల ఔదార్యాన్ని చూసిన పలువురు వారిని అభినందించకుండా ఉండలేకపోయారు.
అరటి గెలలను
ట్రాక్టర్‌కు లోడు చేసుకుంటున్న గొర్రెల కాపరులు
గొర్రెల మేతకు ఉచితంగా అరటి గెలల అందజేత


