యువతి బలవన్మరణం
హిందూపురం: స్థానిక మున్సిపల్ కొత్త మార్కెట్ కాంప్లెక్స్‌లో ఎర్రగడ్డల వ్యాపారి నరసింహులు కుమార్తె భానుతేజ (19) ఆత్మహత్య చేసుకుంది. ఎన్‌లైట్ కళాశాలలో బీబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న భానుతేజ తరచూ సెల్‌ఫోన్‌లో రీల్స్ చూస్తూ చదువుపై అశ్రద్ధ వహించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఐదుగురి అరెస్ట్
బత్తలపల్లి: మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. బత్తలపల్లి మండలం ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన కూరే ప్రమీల ఈ నెల 16న తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతురాలి కుమారుడు సంజీవరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన వడ్డె నెట్టికంటి కోడలు హేమావతి, ఆమె తల్లి రామాంజినమ్మ, బిల్లే ఓసూరప్ప, సుంకన్న, ఆదిలక్ష్మిపై కేసు నమోదు చేసి, గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
చెన్నేకొత్తపల్లి: తోటి విద్యార్థి తనపై చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ధర్మవరంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుకుంటోంది. రోజు కాలేజీకి సీకే పల్లి నుంచి ధర్మవరానికి బస్సులో వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో గురువారం బస్సులో వెళుతుండగా సీకే మండలంలోని మరో గ్రామానికి చెందిన విద్యార్థి బస్సులో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు యువకుడిని విద్యార్థిని మందలించడంతో వెంటనే ఆమైపె చెయ్యి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపిన అనంతరం నేరుగా ఇంటికి ఉరి వేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కాపాడి సీకేపల్లిలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
‘నారాయణ’ విద్యార్థి అదృశ్యం
గోరంట్ల: మండలంలోని కరావులపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి కనిపించడం లేదు. పోలీసులు తెలిపిన మేరకు... కరావులపల్లికి చెందిన చందమూరి ఉమామహేశ్వరరెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకునేందుకు వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన పవన్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24న తిరుగు ప్రయాణమయ్యాడు. గురువారం కళాశాల యాజమాన్యం ఫోన్ చేసి పవన్‌కుమార్ కళాశాలకు రాలేదని సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు అప్రమత్తమై బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లి సుభాషిణి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో వ్యక్తి మృతి
గుడిబండ: మండలంలోని కరికెర గ్రామానికి చెందిన జూలప్ప (35) ద్విచక్రవాహనం అదుపు తప్పికింద పడి మృతి చెందాడు. మడకశిర మండలం నీలకంఠాపురంలో ఉన్న సోలార్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పనిపై బుధవారం రాత్రి నీలకంఠాపురం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బూదిపల్లి సమీపంలోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించే క్రమంలో అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిని అతన్ని అటుగా వెళుతున్న వారు గమనించి మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి ఆయన మృతి చెందాడు. ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దుర్మరణం
హిందూపురం: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం మండలం పూలకుంటకు చెందిన హనుమంతు (30) గురువారం ఉదయం వ్యక్తిగత పనిపై బెంగళూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... తూముకుంట చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే ఎదురుగా గోళాపురం నుంచి భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై వస్తున్న రమేష్ ఢీకొన్నాడు. ఘటనలో ముగ్గురూ రోడ్డుపై పడ్డారు. తలకు తీవ్ర గాయమై హనుమంతు అక్కడికక్కడే మృతిచెందాడు. రమేష్ దంపతులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ: అర్హులైన దివ్యాంగులకు వంద శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాల మంజూరుకు దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు జి.అర్చన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన వారు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
యువతి బలవన్మరణం


