‘మిట్స్’ అసిస్టెంట్ డైరెక్టర్ మారుతీప్రసాద్‌కు డాక్
కురబలకోట: మదనపల్లి సమీపంలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిషన్స్), కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి.మారుతీప్రసాద్‌కు తమిళనాడులోని చైన్నెలో ఉన్న సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ మేరకు మిట్స్ వీసీ యువరాజ్ సోమవారం వెల్లడించారు. ప్రొఫెసర్ భారతి పర్యవేక్షణలో ‘యాన్ ఇంటిలిజెంట్ మల్టీమోడల్ సెక్యూరిటీ ప్రేమ్ వర్క్ ఫర్ ఎమర్జింగ్ అప్లికెషన్స్ యూజింగ్ ఐఓటీ‘ అంశంపై పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మారుతీ ప్రసాద్‌ను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్, చాన్స్‌లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్‌లర్ ఎన్. ద్వారకనాఽథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల అభినందించారు.
జనరేటర్‌లోకి దూరి అజ్ఞాత వ్యక్తి మృతి
అనంతపురం సెంట్రల్: జనరేటర్‌లోకి దూరిన వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. తొమ్మిది రోజుల ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... సోమవారం ఉదయం అనంతపురంలోని సాయినగర్ మొదటి క్రాస్‌లో ఉన్న భారతీ హాస్పిటల్‌కు చెందిన జనరేటర్ వద్ద దుర్వాసన వెదజల్లుతుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జనరేటర్ తలుపు తీసి చూడగా వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా ఈ నెల 8న రాత్రి చలి తీవ్రతకు వణుకుతూ 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మతి స్థిమితం లేని వ్యక్తి జనరేటర్ తలుపు తీసి లోపలకు ప్రవేశిస్తున్న దృశ్యాలు కనిపించాయి. మృతదేహం పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా మారింది. వీఆర్వో రాజారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అనంతపురం రెండో పట్టణ సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపారు.
డాక్టర్ మృతదేహం లభ్యం
ఆత్మకూరు: మండలంలో పంపనూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో ఈతకు దిగి గల్లంతైన డాక్టర్ కార్తీక్‌రెడ్డి (38) మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపిన మేరకు.. అనంతపురంలో నివాసముంటున్న కార్తీక్ రెడ్డి బెళుగుప్ప పీహెచ్‌సీలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం బంధువులతో కలిసి పంపనూరు సిటీ పార్కుకు వన భోజనాల నిమిత్తం వచ్చారు. భోజనాల అనంతరం పంపనూరు హంద్రీ–నీవా కాలువలో ఈత కొట్టేందుకు దిగారు. కాలువలో నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కాలువలో గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం పంపనూరు తండా సమీపంలో కాలువలో మృతదేహం కొట్టుకుపోతుండటం చూసిన ఓ గొర్రెల కాపరి నీటిలోకి దిగి గట్టుకు లాగాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న బంధువులు కార్తీక్ రెడ్డి మృతదేహంగా గుర్తించారు. భర్త మృతదేహాన్ని చూసి భార్య శ్రావణి గుండెలవిసేలా రోదించింది. తనను, కూతుర్ని ఒంటరిని చేసి వెళ్లిపోయావా అంటూ ఆమె విలపించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. కాగా, డాక్టర్ కార్తీక్ రెడ్డి గల్లంతైన రోజు ఫైర్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ఫైర్ సిబ్బంది నలుగురు అక్కడకు చేరుకున్నా కనీసం ఒక్కరు కూడా కాలువలోకి దిగలేదు. సోమవారం కూడా మృతదేహం ఉన్న చోటుకు ఫైర్ సిబ్బంది చేరుకున్నా.. కనీసం నీటిలో దిగలేదు. చివరకు మృతదేహాన్ని వెలికి తీసేందుకు తాడు లేకపోవడంతో మృతుడి తరఫు మహిళల చున్నీలను కట్టి బయటకు తీయాల్సి వచ్చింది. ఇది కూడా స్థానికులే ముందుకు వచ్చి చేశారు.
‘మిట్స్’ అసిస్టెంట్ డైరెక్టర్ మారుతీప్రసాద్‌కు డాక్
‘మిట్స్’ అసిస్టెంట్ డైరెక్టర్ మారుతీప్రసాద్‌కు డాక్


