వివాహిత బలవన్మరణం
బత్తలపల్లి: అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వకపోగా.. దాడికి పాల్పడడంతో క్షణికావేశానికి లోనై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలు భార్య కూరే ప్రమీల (47).. అదే గ్రామానికి చెందిన వడ్డె నెట్టికంటికి ఐదేళ్ల క్రితం రూ.20వేలు అప్పుగా ఇచ్చింది. దీనికి మూడేళ్ల పాటు వడ్డీ చెల్లించారు. ఆ తర్వాత వడ్డీ, అసలు చెల్లించే విషయంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ప్రమీల తన పొలంలో పని చేసిన కూలీలకు డబ్బులు ఇవ్వాలంటూ తన బంధువు పెద్దక్కకు ఇచ్చి పంపింది. అయితే పెద్దక్క ఆ డబ్బు కూలీలకు ఇవ్వలేదు. దీంతో ప్రమీల మందలిస్తుండగా ఇంటి పక్కనే నివాసముంటున్న వడ్డె నెట్టికంటి కోడలు హేమ ద్వారా విషయం తెలుసుకున్న బంధువు ఆదిలక్ష్మి అక్కడకు చేరుకుని ప్రమీలతో గొడవపడింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఆదిలక్ష్మి మామ సుంకన్న... తమ వాళ్లనే దూషిస్తావా అంటూ ప్రమీలపై దాడి చేశాడు. ఆ తర్వాత హేమాను ప్రమీల మందలించడంతో విషయాన్ని బత్తలపల్లిలో ఉంటున్న తన అమ్మకు హేమ చేరవేసింది. దీంతో ఆమె తనకు పరిచయమున్న వ్యక్తిని ఉప్పర్లపల్లికి పంపింది. అతను నేరుగా ప్రమీల ఇంటికి చేరుకుని దాడికి పాల్పడ్డాడు. దీంతో అవమానాన్ని తాళలేని ప్రమీల ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు సంజీవరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైతు దుర్మరణం
గోరంట్ల: కారు ఢీకొన్న ఘటనలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం బూదిలి తండాకు చెందిన గోపీ నాయక్ (65) తన పొలంలో పండించిన మొక్కజొన్న పంటను బూదిలి సమీపంలోని మరమ్మదు దశలోఉన్న 342వ జాతీయ రహదారిపై ఆరబోశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కాపలాకు వెళ్లిన ఆయన సోమవారం ఉదయం చలి మంట కోసమని చెత్త తీసుకునేందుకు రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపు నుంచి గోరంట్ల వైపుగా వెళుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన గోపీనాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


