 
															ప్రేమ... పెళ్లి.. ఓ కిడ్నాప్
● యువకుడిని చితకబాదిన
మహిళ బంధువులు
అనంతపురం సెంట్రల్: ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అగ్రవర్ణ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. అదే మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన కురుబ బాలకొండ శంకరయ్య(32) ఆమెతో పరిచయం పెంచుకుని చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఇటీవల ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం చేయాలని నిశ్చయించారు. విషయం తెలుసుకున్న శంకరయ్య బుధవారం ఆమెను తన వెంట పిలుచుకెళ్లాడు. పెళ్లి ప్రయత్నాలు చేస్తుండగా తెలుసుకున్న మహిళ బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురంలోని రాంనగర్‌లో ఉన్నాడని తెలుసుకుని కారులో వచ్చి శంకరయ్యను కిడ్నాప్ చేశారు. నగర శివారుకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ విషయంపై డయల్ –100కు సమాచారం వెళ్లడంతో అక్కడి నుంచి ఆదేశాలు అందుకున్న అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అప్రమత్తమై, బాధితుడు పడి ఉన్న చోటుకు చేరుకున్నారు. ఒళ్లంతా తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న శంకరయ్యను సర్వజనాసుపత్రికి తరలించారు. కిడ్నాప్‌నకు పాల్పడిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు సీఐ జగదీష్ నిరాకరించారు. అత్యంత గోప్యంగా కేసును విచారిస్తుండడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
