 
															వ్యక్తి బలవన్మరణం
ధర్మవరం రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని సిద్దయ్యగుట్టకు చెందిన ఊర్లకుంట శ్రీనివాసులు (48)కు భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఫైనాన్స్ కింద కారు కొనుగోలు చేసి అద్దెలకు తిప్పుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల కాలంలో కారుకు అద్దెలు లేకపోవడంతో కంతులు చెల్లించడం భారమైంది. ఈ నేపథ్యంలోనే కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు బుధవారం తెల్లవారుజామున ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని వాహనాల పార్కింగ్ షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేశారు.
కొనసాగుతున్న
సీఏఎస్ ఇంటర్వ్యూలు
అనంతపురం: జేఎన్‌టీయూ –అనంతపురంలో కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం (సీఏఎస్) ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. బోధనా సిబ్బందికి పదోన్నతి ఇవ్వడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఈసీఈ, సీఎస్‌ఈ, కెమికల్, మేథమేటిక్స్, కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
