శతజయంతి వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం
ప్రశాంతి నిలయం: భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు మంగళవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లపై గవర్నర్ ఆరా తీశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రత్నాకర్ కలిసి బాబా శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు.
మడకశిర కేంద్రంగా
రెవెన్యూ డివిజన్?
మడకశిర: పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాలు పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అగళి, అమరాపురం మండలాలు పెనుకొండకు దాదాపు 85 కిలోమీటర్లు, రొళ్ల, గుడిబండ మండలాలు 65, మడకశిర మండలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నియోజకవర్గ ప్రజలు పనుల కోసం పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లాలంటే అనేక వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు మండలాలను పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోనుంచి తప్పించి మడకశిర కేంద్రంగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన వెంటనే మడకశిర రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారనున్నట్లు ఓ అధికారి తెలిపారు.


