● శ్రమదానంలో ఆదర్శం
రొళ్ల: గ్రామీణ ప్రాంతాల అభివృద్దిని ప్రభుత్వం విస్మరించింది. సమస్యపై పలుమార్లు విన్నవించినా స్పందన కరువైంది. స్థానిక ప్రజాప్రతినిధి సైతం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు నమ్మకం కోల్పోయారు. ఇక ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని వేచి చూడకుండా చెయ్యిచెయ్యి కలిపారు. శ్రమదానంతో 4 కిలోమీటర్ల మేర రహదారిని బాగుపరుచుకున్నారు. వివరాల్లోకెళితే.. రొళ్ల మండలం కొడగార్లగుట్ట క్రాస్ 544ఈ జాతీయ రహదారి నుంచి టీడీ పల్లి గ్రామానికి దాదాపు 4 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణించాల్సి వస్తుంది. పదేళ్ల క్రితం తారు రోడ్డు వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రోడ్డు నిర్వహణను ప్రభుత్వం కానీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. రోడ్డుకు ఇరువైపుల పెరిగిన ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పరిస్థితిని ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి బాగు చేయాలని పలుమార్లు విన్నవించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దాదాపు 150 మందికి పైగా గ్రామస్తులు ఏకమై మంగళవారం శ్రమదానం చేపట్టి ముళ్లకంపలు, పిచ్చి మొక్కలను తొలగించారు.


