వెయ్యేళ్ల నాటి శాసనం గుర్తింపు
ధర్మవరం రూరల్: మండలంలోని కుణుతూరు వద్ద ఉన్న ప్రాచీన శివాలయం సమీపంలో ఉన్న శాసనం వెయ్యేళ్ల నాటిదని చరిత్ర పరిశోధకుడు బుక్కపట్నం గోపి తెలిపారు. మంగళవారం ఆయన కాలభైరవ శివాలయంలోని రెండు శాసనాలు, కొల్లాపురమ్మ గుడిలోని ఒక శాసనాన్ని పరిశీలించారు. ఈ మూడు శాసనాలు కన్నడ లిపిలో ఉన్నాయన్నారు. ఈ శాసనాన్ని క్రీ,.శ. 1218వ సంవత్సరంలో అక్టోబర్ 22న దేవగిరి యాదవరాజు రెండవ సింహనుడు (సింగనుడు) రాయించినట్లు తెలుస్తోందన్నారు. వీటిపై సమగ్ర అధ్యాయనానికి నమూనాలను తీసి మైసూరులోని భారత పురావస్తు శాఖ కార్యాలయం డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి పంపినట్లు వివరించారు.
ఎండీఎం నిర్వాహకులపై
అట్రాసిటీ కేసు నమోదు
కనగానపల్లి: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని కులం పేరుతో దూషించిన ఎండీఎం (మధ్యాహ్న భోజన ఏజన్సీ) నిర్వాహకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కనగానపల్లి ఎస్‌ఐ మహమ్మద్ రిజ్వాన్ తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో వారం రోజుల క్రితం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఉపాధ్యాయురాలు నాగలక్ష్మిపై స్థానిక టీడీపీ నేత, ఎండీఎం నిర్వాహకుడు నాగేంద్ర దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయురాలిపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూిషించారన్న కారణాలతో మంగళవారం ఎండీఎం నిర్వాహకుడు నాగేంద్రతో పాటు మరో ఇద్దరు మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
క్రీడా ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం కార్పొరేషన్: అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు నగదు ప్రోత్సాహక పథకానికి వచ్చే నెల 4వ తేదీ రాత్రి 11.59 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్‌డీఓ మంజుల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఏఏపీ కేఆర్‌ఈఈడీఏ (సాప్ క్రీడా) యాప్ లేదా https://sports.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
పామును కాపాడబోయి...
గార్లదిన్నె: విష సర్పాన్ని కాపాడబోయిన ఓ వ్యక్తి చివరకు దాని కాటుకు మృతిచెందాడు. వివరాలు.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన నెట్టికల్లు (57)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కల్లూరులోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం తన ఇంటి సమీపంలోని ఓ ఇంట్లో పాము ఉందని తెలుసుకున్న నెట్టికల్లు.. దానిని కాపాడి సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళుతుండగా కాటేసింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పామిడిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులకు పోకిరి అప్పగింత
హిందూపురం: స్థానిక శాంతినగర్ చెందిన 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన మహబూబ్‌బాషాను స్థానికులు పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మేళాపురంలో నివాసముంటున్న బాలిక తన శాంతినగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి పిల్లలతో ఆడుకుంటుండగా మహబూబ్‌బాషా మాయ మాటలతో పిలుచుకెళ్లి అసభ్య ప్రవర్తించాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే మహబూబ్ బాషాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతినగర్‌లో మరికొందరు యువకులు.. మహిళలు, బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌బాషాతో పాటు మరో నలుగురు మద్యం తాగి మైనర్ బాలికల పట్ల వేధింపులకు పాల్పడ్డారని వివరించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని వివరించారు.
ప్రమాదంలో చేనేత కార్మికుడికి తీవ్రగాయాలు
ధర్మవరం అర్బన్: లారీ దూసుకెళ్లడంతో ఓ చేనేత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని సాయినగర్‌కు చెందిన చేనేత కార్మికుడు నాగమునెప్ప మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై శివానగర్‌కు వెళ్లి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఎన్టీఆర్ సర్కిల్‌లోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. కిందపడిన నాగమునెప్ప కాలిపై లారీ వెనుక చక్రం వెళ్లడంతో కుడి కాలు నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే నాగమునెప్పను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వెయ్యేళ్ల నాటి శాసనం గుర్తింపు
వెయ్యేళ్ల నాటి శాసనం గుర్తింపు


