 
															అదృశ్యం.. ఆందోళనకరం
కదిరి: జిల్లాలో బాలికలు, యువతుల అదృశ్యాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చదువు, ఒత్తిడి ఇతర విషయాలు ఓ కారణమైతే, అత్యధికులు ప్రేమ మోజులో పడి ఇంటి నుంచి కానీ, పాఠశాల నుంచి కాని ప్రియుడితో కలసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. పరిణతి చెందని వయసులో ఆకర్షణకు లోను కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏడాదిగా ఈ తరహా అదృశ్యం కేసులు కలవరపెడుతున్నాయి.
‘హాయ్’..తో మొదలు..
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి రాత్రి నిద్ర పోయే వరకూ ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, ఇన్‌స్ట్రాగాంలో రీల్స్ షేర్ చేయడం, ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే వెనుకాముందు ఆలోచించకుండా ఆమోదించేస్తున్నారు. అటు వైపు నుంచి హాయ్.. అని మెసేజ్ రాగానే హలో అంటూ మొదలు పెట్టేస్తున్నారు. చివరకు ఈ హాయ్.. హలోలే ప్రేమ సందేశాలుగా మారిపోతున్నాయి. ఈ మాయలో చిక్కుకున్న ఎంతోమంది బాలికలు కన్నవాళ్లను ఏమార్చి పారిపోతున్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకునే లోపే జీవితం చేయిదాటిపోతోంది. పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ కనిపించకుండా పోయిన బాలికల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఫొటోలు పంపి చిక్కుల్లో..
కొందరు బాలికలు సోషల్ మీడియాలో పెరిగిన పరిచయంతో అదే లోకంగా ఊహల్లో తేలిపోతున్నారు. కన్నవారి కన్నా సోషల్ మీడియాలో పరిచయమైన వారే గొప్పగా భావిస్తున్నారు. అవతలి వ్యక్తిని గుడ్డిగా నమ్మి వారు అడిగినప్పుడల్లా తమ పర్సనల్ ఫొటోలు, వీడియోలు పంపి చిక్కుల్లో పడుతున్నారు. ఇంకొందరు యువతులు శారీరక సంబంధం వరకూ అవకాశం ఇచ్చి చివరకు మోసపోయామని తెలుసుకొని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ కోకొల్లలుగా ఉన్నాయి.
జిల్లా వ్యాపంగా ఈ ఏడాది 287 రోజుల్లో 139 మంది బాలికలు కనిపించకుండాపోయారు. పరువు కోసం పోలీసుల దృష్టికి రాని కేసులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ప్రతి రెండు రోజులకు ఓ మైనర్ బాలిక అదృశ్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. వీటిలో 97 శాతం కేసులు ప్రేమ వ్యవహారాలేనని పోలీసుల విచారణలో బయట పడుతున్నాయి.
● మూడు రోజుల క్రితం నల్లచెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్ బాలికలు పాఠశాల వదిలిన తర్వాత ముగ్గురు అబ్బాయిలతో కలిసి ద్విచక్ర వాహనాల్లో వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తర్వాత వారు అనంతపురంలో ఉన్నారని తెలుసుకుని వెంటనే తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
● కదిరి అడపాలవీధికి చెందిన ఓ మైనర్ బాలిక ఓ వస్త్ర దుకాణంలో పని చేసేది. ఈ నెల 11న విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో అదృశ్యమైంది. అన్ని చోట్లా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 16న ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
● ఈ నెల 15న మడకశిరకు చెందిన ఒక మైనర్ బాలిక తన మేనత్త ఇంటికి వెళ్లి అక్కడి నుంచి అదృశ్యమైంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
● కదిరి రూరల్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన మైనర్ బాలిక ఈ నెల 15న కనిపించకుండా పోయింది. తన కుమార్తె కన్పించడం లేదంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
● కదిరి పట్టణంలోని వలీసాబ్‌రోడ్డుకు చెందిన ఓ మైనర్ బాలిక సైతం కనిపించడం లేదు. తాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంవలీ కాలనీకి చెందిన ఓ యువకుడు తన మనవరాలితో చనువుగా ఉండేవాడని, అదృశ్యం వెనుక ఆ యువకుడి హస్తం ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు, మహిళల అదృశ్యాలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలోనే 139 మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇక పరువు కోసం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉన్న కేసులు అదే స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
జిల్లాలో పెరిగిపోతున్న
బాలికల అదృశ్యం కేసులు
ప్రతి రెండు రోజులకు ఓ కేసు నమోదు
ఆకర్షణకు లోనై మాయమవుతున్న మైనర్ బాలికలు
మచ్చుకు కొన్ని..
 
							అదృశ్యం.. ఆందోళనకరం
 
							అదృశ్యం.. ఆందోళనకరం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
