సీజీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

సీజీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

Oct 24 2025 2:22 AM | Updated on Oct 24 2025 2:22 AM

సీజీ

సీజీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

తనకల్లు: మండలంలోని చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు (సీజీ ప్రాజెక్టు) నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా సీజీ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. రెండేళ్ల తరువాత సీజీ ప్రాజెక్టు నిండడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి (170 ఎంసీఎఫ్‌టీ) చేరుకోవడంతో గురువారం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ జలహారతి చేసి, ఓ గేటు పైకెత్తి నీటిని దిగువకు వదిలారు. శుక్రవారం ఉదయం ప్రాజెక్టు గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తడానికి అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎడ్ల బండి అదుపు తప్పి రైతు మృతి

పరిగి: ఎడ్ల బండి అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ రైతు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు పరిగి మండలం గొరవనహళ్లికి చెందిన లింగణ్ణ గారి నారాయణప్ప(69)కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగించే నారాయణప్ప బుధవారం గడ్డి కోసుకుని ఎడ్ల బండిపై వేసుకుని ఇంటికి బయలుదేరాడు. మలుపు వద్ద గట్టుపైకి బండి చక్రం ఎక్కడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో బండి కింద పడి నారాయణప్ప ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కుమారుడు సోమశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంగడుయాదవ్‌ తెలిపారు.

గాలిమరపై పిడుగు

కూడేరు: గాలిమరపై పిడుగు పడి మంటలు చెలరేగిన ఘటన మండల పరిధిలోని కలగళ్ల గ్రామంలో జరిగింది. కలగళ్లలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన జోరు వర్షం కురిసింది. గ్రామ సమీపాన గ్రీన్‌కో కంపెనీ ఏర్పాటు చేసిన గాలిమరపై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగి గాలిమర కాలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గాలిమర కాలిపోవడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు కంపెనీకి చెందిన ప్రతినిధులు తెలిపారు.

సీజీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల 1
1/1

సీజీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement