ఇంటర్ విద్యార్థి అదృశ్యం
అనంతపురం సిటీ: నగర శివారులోని శ్రీమాస్టర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కనిపించకుండా పోయాడు. విషయాన్ని కళాశాల యాజమాన్యం దాచిపెట్టి ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలపడంపై ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు... శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన జి.గంగాధర్ కుమారుడు దిలీప్.. శ్రీమాస్టర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో చేరాడు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి దిలీప్ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి కుటుంబ సభ్యులకు తెలపకుండా, కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాత్రి 10.30 గంటల తరువాత తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం ఉదయం తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని బిడ్డ గురించి ఆరా తీయగా కళాశాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విషయం తెలుసుకున్న ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు మాట్లాడుతూ.. కళాశాల నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్‌ను కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న ఆర్‌ఐఓ హామీతో వారు ఆందోళన విరమించారు.
తల్లిదండ్రులకు ఆలస్యంగా
సమాచారం ఇచ్చిన యాజమాన్యం
గుర్తింపు రద్దు చేయాలంటూ
ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా


