 
															శుద్ధజలం.. అబద్ధం
పుట్టపర్తి టౌన్: ప్రజల అవసరాలే వారికి ఆదాయ వనరులుగా మారుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే నీరు ఆయోదయోగ్యంగా లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో శుద్ధ జలాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అదనుగా అనధికారిక పాంట్లు ఏర్పాటు చేసుకున్న కొందరు శుద్ధ జలాల ముసుగులో బోరుబావి నీళ్లను సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పల్లె.. పట్నం తేడా లేకుండా ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా కొనసాగుతోంది.
నిబంధనలకు పాతర..
జిల్లాలోని పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, కదిరి, మడకశిర పట్టణాల్లో సుమారు 200లకు పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో 70 శాతానికి పైగా వాటర్ ప్లాంట్‌లకు అనుమతులు లేవు. పల్లెల్లో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్‌తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో వెలుస్తున్న ప్రైవేటు వాటర్ ప్లాంట్‌ల కారణంగా ప్రజారోగ్యం దెబ్బతింటున్నట్లు సమాచారం. అధికారంగా ఆమోదం పొందిన ప్లాంట్ల నిర్వాహకులు సైతం నాణ్యత పాటించకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫ్యూరిఫైడ్ పేరుతో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారిక పర్యవేక్షణ లోపించడంతో జనం జబ్బు బారిన పడుతున్నారు. ఈ అంశంపై జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి రామచంద్ర మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లను మూసి వేస్తామని పేర్కొన్నారు. తనిఖీలు చేపట్టి బోరు నీటిని సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొంటామన్నారు.
అనారోగ్యాలతో ప్రజలకు తప్పని తిప్పలు
ఎలాంటి అనుమతులు లేకుండా
పాంట్ల నిర్వహణ
పట్టించుకోని అధికారులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
